హెచ్‌ఎండీఏని వీడని అవినీతి జాడ్యం
19-06-2017 06:31:24
హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): దేనికోసం దరఖాస్తు చేసినా... నెలలు గడవనిదే అనుమతులు లేదా క్రమబద్ధీకరణ పత్రాలు చేతికందవు. కాళ్లరిగేలా తిరిగినా అధికారులు కనికరించరు. సరైన సమాధానమూ ఉండదు. ఇది హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)పై పౌరుల అభిప్రాయం. ‘ఆల్‌ టైమ్‌ లేట్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌’ అనే విమర్శనాత్మక బిరుదూ ఈ సంస్థకు సొంతం. ఈ అపప్రదను తొలగించుకునేందుకు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. పారదర్శక పౌరసేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. వీటికి తోడు పాలనా పరంగా పలు సంస్కరణలు తీసుకొచ్చారు. విధుల్లో తప్పులు చేసిన వారిపై సస్పెన్షన్‌ వేటు వేసినా ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. అవకాశం ఉంటే అందినకాడికి జేబుల్లో వేసుకోవడాని కి ఉద్యోగులు వెనకాడడం లేదు.
 
               హెచ్‌ఎండీఏలో శాశ్వి త ఉద్యోగులే కాదు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సైతం అవినీతికి పాల్పడుతున్నారు. తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనలో అవినీతికి పాల్పడిన 5 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపైనా కమిషనర్‌ టి.చిరంజీవులు వేటు వేశారు. ఇంతకు ముందు సైతం ప్రణాళికా విభాగంలోనూ అవినీతికి పాల్పడిన సహాయ ప్రణాళికా విభాగం అధికారిని సస్పెండ్‌ చేశారు. ఇలా హెచ్‌ఎండీఏలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన వెంటనే క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. అయినా పదే పదే కొందరు ఉద్యోగులు మాత్రం అవినీతి జాడ్యం నుంచి బయటకు రావడం లేదు.
 
సంస్కరణలు తాత్కాలికమే..
పారదర్శక పౌరసేవలు అందించే క్రమంలో పాలనాపరమైన అంశాల్లో హెచ్‌ఎండీఏ సంస్కరణలు చేస్తోం ది. ఇందులో భాగంగా ప్రధానమైన ప్రణాళికా విభాగంలో ప్రక్షాళన చేపట్టింది. మంచి ఆదాయ మార్గంగా ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ప్రక్రియలో ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలియడంతో గతేడాది డిసెంబర్‌లో ప్రణాళికా విభాగంలో ఉన్న డైరెక్టర్‌ స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న 50 మంది ఉద్యోగుల స్థానాల్లో మార్పులు చేశారు. అంతటితో ఊరుకోకుండా అవినీతి ఆరోపణలు వచ్చిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయడంతో పాటు కొందరికి శాఖా పరంగా మెమోలు జారీ చేశారు. ఇలా ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. ఏడాదిన్నర కాలంగా చేపడుతున్న సంస్కరణలు ఉద్యోగుల్లో భయం కొంతకాలం వరకే అన్నట్టుగా ఉంది. ఏదో ఒక మార్గంలో సొమ్ము చేసుకునేందుకు చివరకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వెనుకాడడం లేదు.
 
దరఖాస్తుల పరిశీలనలో మార్పులు చేసినా..
ప్రస్తుతం వివిధ అనుమతుల నిమిత్తం వస్తున్న దరఖాస్తులు జేపీఓ నుంచి కమిషనర్‌ వద్దకు వెళ్లాలంటే కనీసం ఐదారుగురు ఆఫీసర్లు పరిశీలించాలి. ఒక్కో ఫైల్‌ రెండు దఫాలుగా ఆయా అధికారుల వద్దకు వెళ్లి.. పరిశీలన పూర్తవడానికి ఐదారు నెలలు పడుతుంది. ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూస్‌ (సీఎల్‌యు) ఫైల్‌ అయితే ఆరు నెలల్లో పూర్తయితే అదో అద్భుతం. దీనిపై గతంలో ప్రణాళికా విభాగాన్ని ఐదు యూనిట్లు, సబ్‌ యూనిట్లుగా విభజిస్తు పలు మార్పులు చేయాల ని హెచ్‌ఎండీఏలో జరుగుతున్న అడ్మినిస్ర్టేషన్‌పై అధ్యయనం చేసిన ఆస్కీ సూచించింది. బిజినెస్‌ ప్రాసెసింగ్‌ రీ-ఇంజనీరింగ్‌లో బాగంగా ఇంత మంది అధికారుల వద్దకు ఫైల్‌ వెళ్లడమూ జాప్యానికి ఒక కారణంగా భావించి.. జేపీఓ, ఏపీఓలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తు క్షేత్రస్థాయిలో ఫైల్‌ను పరిశీలించి నేరుగా ప్లానింగ్‌ ఆఫీసర్‌కు పంపేలా నిబంధనను మార్చాలని సూచించింది. ఒక్కో అధికారి ఎన్ని రోజుల్లోపు ఫైల్‌ పరిశీలన పూర్తి చేయాలో కూడా అస్కి నివేదికలో పేర్కొంది.
 
                    ఒకవేళ సంబంధిత అధికారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే.. కారణాలను వివరిస్తు మరో అధికారి వద్దకు ఆ ఫైల్‌ను బదలాయించే అధికారం సీపీఓకు కల్పించారు. దీనివల్ల ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నా పైసలు ఇవ్వనిదే పైళ్లు ముందుకు కదలడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు వచ్చిన సమయంలో కమిషనర్‌ వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటున్నా అవి కొంత మేరకే ప్రభావం చూపడుతున్నాయనే అభిప్రాయం ఉంది. వేరే చోటుకి బదిలీలు లేకపోవడం, సస్పెండ్‌ అయినా కొన్నాళ్లు మళ్లీ అదే సంస్థలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉండడంతోనే అవినీతి అంతం కావడం లేదనే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.