ట్యాక్స్‌ వసూళ్లలో అవకతవకలు... ప్రభుత్వ ఆదాయానికి గండి..!
19-06-2017 06:12:03
హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఆటో మొబైల్‌ డీలర్లు స్వంత లాభం కోసం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. వాహనాల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా వ్యవహరించాల్సిన డీలర్లు తప్పుడు సమాచారంతో అటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, ఇటు కొనుగోలు దారులను నిలువునా ముంచేస్తున్నారు. ప్రస్తుతం ఆటో మొబైల్‌ డీలర్ల వద్దే వాహనాలకు సంబంధించిన జీవిత కాలపు పన్ను వసూలు, భీమా చార్జీలు, తాత్కాలిక రిజిస్ర్టేషన్‌, శాశ్వత రిజిస్ర్టేషన్‌, హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌కు సంబంధించిన ఫీజులను వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే వాహనం కలిగి ఉన్న వారు ఎవరైనా రెండో వాహనాన్ని కొనుగోలు చేస్తే వారికి అదనంగా 2-4 శాతం వరకు వాహనాన్ని బట్టి వసూలు చేయాల్సిన బాధ్యత డీలర్లపై ఉంది. ఈ విషయాన్ని వాహనకొనుగోలుదార్లకు చెప్పకుండా వాహనాలను విక్రయిస్తున్నారు.
 
              రవాణాశాఖలో పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే వాహనాల అమ్మకాలు కొనుసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ వెబ్‌సైట్‌లో వాహనం కొనుగోలుదారుడి వివరాలు నమోదు చేయగానే అతనికి ఇంతకు ముందు వాహనం ఉందో లేదో తెలియజేస్తుంది. ఈవిషయం స్పష్టంగా తెలిసినా దాని కొనుగోలుదార్లకు చెప్పకుండా తప్పుడు పేర్లు (అక్షరాలు తప్పుగా) నమోదు చేసి అదనం పన్ను కట్టే అవసరం లేకుండా వాహనాలను విక్రయిస్తున్నారు. అలా కొనుగోలు చేసిన వాహనాలను రిజిస్ర్టేషన్‌కు తీసుకువెళితే కొందరు ఆర్టీఏ అధికారులు పూర్తి స్థాయిలో పరీక్షిస్తుండగా, మరి కొందరు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకొని కొందరు ఆర్టీఏ అధికారులు డీలర్లకు సహకరిస్తూ అందినకాడికి జేబులో వేసుకుంటున్నారు. ఇలాంటి అవకతవకలకు పాల్పడడంతో రవాణా శాఖ అధికారులు ఒకేసారి పది మంది సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. ఇలాంటి సందర్భంలో ఆయా వాహనాలను విక్రయించిన ఆటో డీలర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా రవాణా శాఖ అధికారులు వా రిపై కన్నెత్తి చూడడం లేదు. మధ్యలో అధికారులను బలిపశువులుగా చేశారన్న వాదనలు ఉన్నాయి.
 
గ్రేటర్‌ పరిధిలోనే అధికం..
రెండవ వాహనాన్ని కొనుగోలు చేసే వారు గ్రేటర్‌ పరిధిలోనే అధికంగా ఉంటున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మే డ్చల్‌ జిల్లా పరిధిలోనే సుమారు 300 వరకు ఆటో మొబైల్‌ షోరూమ్‌లు ఉన్నాయి. వాహనాల అమ్మకాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే డీలర్లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనాలకు డిస్కౌంట్ల పేరుతో డీలర్లు మోసాలకు పాల్పడుతున్నట్లు గతంలోనూ గుర్తించారు. డీలర్లపై కఠినంగా వ్యవహరించకపోవడం, తప్పుచేసిన ఆటో మొబైల్‌ షోరూమ్‌లను రద్దు చేయకపోవడంతో వారు అవకాశం దొరికినప్పుడల్లా అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆటో మొబైల్‌ డీలర్లు వాహనాల విక్రయంలో ఆర్టీఏ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చేయాలని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.