హైదరాబాద్‌లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
19-06-2017 05:57:53
వారసత్వ భూమి అంటూ ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న ప్రైవేట్‌ వ్యక్తులు
హైదరాబాద్/మాదాపూర్‌: మియాపూర్‌లోని రూ.15వేల కోట్ల ప్రభుత్వ భూముల భూ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుగుతుంటే మరో పక్క ఖాళీజాగా... వేసే పాగా అన్నచందంగా హైటెక్‌సిటీ మాదాపూర్‌ పరిధిలోని గుట్టలబేగంపేట సర్వేనెంబర్‌ 63లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు తమ వారసత్వంగా వచ్చిన భూమిఅంటూ ప్లాట్లు చేసి మధ్యతరగతి, సామాన్య ప్రజలకు విక్రయిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భూమిలో పాగా వేసిన కబ్జాదారులు ప్లాట్లల్లో గదులు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు చూసీచూడనట్లు వ్యవహరించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెతుతున్నాయి.
 
వివరాల్లోకి వెళ్లితే...
గుట్టలబేగంపేట గ్రామసర్వేనెంబర్‌ 63లో దాదాపు 90ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొంతకాలంగా ప్రైవేట్‌ వ్యక్తులు ఈ భూమిపై తమకు హక్కుఉందని వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులంటూ దాదాపు రెండెకరాల్లో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. కొంతమంది బడా బాబులు, రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ భూమిలో ప్లాట్లుగా చేసి నిర్మాణాలు చేపడుతుంటే ప్రభుత్వ అధికారులు కూల్చేశారు. అయినపట్టికీ కబ్జాల పరంపర కొనసాగుతునే ఉంది.

కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు
గుట్టలబేగంపేటలోని సర్వేనెంబర్‌ 63లో 90ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొంత స్థలాన్ని ఆక్రమించి గదులు నిర్మిస్తున్నారని సమాచారం తెలియడంలో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కూల్చివేశారు. మరోసారి ఈ స్థలంలో నిర్మాణాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
- రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌