దేశవ్యాప్తంగా బొగ్గు సమ్మె వాయిదా
19-06-2017 05:49:16
  • కార్మిక సంఘాల చర్చలు ఫలప్రదం
  • ఈపీఎఫ్‌లో సీఎంపీఎఫ్‌ విలీన నిర్ణయం నిలిపివేత
మంచిర్యాల/కొత్తగూడెం అర్బన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు బొగ్గు సంస్థల్లో జరగాల్సిన సమ్మె వాయిదా పడింది. ఈ నెల 19 నుంచి 21 వరకు సమ్మె నిర్వహించాలన్న పిలుపును జాతీయ సంఘాలు ఉపసంహరించుకున్నాయి. ఆదివారం కేంద్రం ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఒప్పందం కుదరడంతో సమ్మెను వాయిదా వేసుకున్నట్లు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యులు మంద నర్సింహారావు తెలిపారు. సీఎంపీఎఫ్‌ను ఈపీఎఫ్‌లో కలిపే ప్రతిపాదనను నిలిపివేసినట్లు ఆయన చెప్పారు. ఇదే స్ఫూర్తితో సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధించుకుంటామన్నారు. ఆదివారం కోల్‌కతాలో జేబీసీసీఐ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం తరపున కేంద్ర బొగ్గు గనుల డిప్యూటీ సెక్రటరీ మహేంద్ర ప్రతాప్‌, కేంద్ర డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ఎస్‌.ఛటర్జీ, ఐదు జాతీయ కార్మిక సంఘాల తరపున నాథులా పాండే, రాజేందప్రసాద్‌ సింగ్‌ (హెచఎంఎ్‌స), బ్రిజేంద్ర కుమార్‌ రాయ్‌, పి.కె.దత్త (బీఎంఎస్‌), రామేంద్ర కుమార్‌ (ఏఐటీయుసీ), రాజేంద్ర పీడీ సింగ్‌ ఎస్‌.క్యూ, జమా (ఐఎనటీయుసీ), డీడీ రామానందన (సీఐటీయు) పాల్గొన్నారు.