ADVT
అనన్య సామాన్యం
04-03-2017 23:49:48
సమ్మర్‌ హాలీడేస్‌ వస్తున్నాయంటే.. అందరూ తమ తమ ప్లాన్‌లలో ఉంటారు. ఇష్టమైన ప్రదేశానికి వెళ్లాలని కొందరు.. అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో హాయిగా గడిపేయాలని ఇంకొందరు.. నచ్చిన వాటిని నేర్చుకోవాలని మరికొందరు ఆలోచిస్తుంటారు. పదిహేడేళ్ల అనన్య సాలుజా కూడా తన ప్రణాళిక తయారుచేసుకుంది. కానీ కాలక్షేపం చేయడానికి కాదు గ్రంథాలయాలు కట్టించడానికి, పేద విద్యార్థులకు చదువు చెప్పడానికి. అనన్య జర్నీ గురించి మరిన్ని విశేషాలు..
 
 ఒకానొక రోజు.. న్యూఢిల్లీ, మౌల్సారి క్యాంప్‌సలోని శ్రీరామ్‌ స్కూల్లో ఓ పదిహేనేళ్ల అమ్మాయి శ్రద్ధగా చదువుకుంటుంది. ఆమె పేరే అనన్య. అసలే పదో తరగతి. బోర్డ్‌ పరీక్షలు. ఇక తన మనసంత.. పుస్తకాలు, ట్యూషన్ల చుట్టే తిరుగుతుంది. ఆ సమయంలోనే అనన్య ధ్యాస పిల్లలకు పాఠాలు నేర్పించడం మీదకు మళ్లింది. అదెలా..అంటే ఆమె చదువుకునే పాఠశాల కరిక్యులమ్‌ ప్రకారం విద్యార్థులు.. పేదపిల్లలకు పాఠాలు బోధించాలి. అంతలోనే తన పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా రాసింది. ఆ తర్వాత 17,000ఫీట్‌ అనే స్వచ్ఛంద సంస్థ గురించి తెలుసుకుంది. అది నిర్వహించే సుజాత సాహు, అనన్య స్కూల్లోనే ఇంతకు ముందు ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. అనన్య, ఆ ఎన్‌జీవో నిర్వాహకులను కలిసింది. అలా రెండేళ్ల క్రితం వేసవి సెలవుల్లో అనన్య ఎన్‌జీవో సాయంతో లడఖ్‌, లేహ్‌ ప్రాంతాల్లోని లిక్స్టే, టుర్తుక్‌, టియాలింగ్‌, మాథో గ్రామాల్లోని పిల్లలకు పాఠాలు బోధించింది. ఆ తర్వాత జమ్మూ, కశ్మీర్‌లను పర్యటించింది. ఈసారి కార్గిల్‌ వెళుతోంది. అయితే ఇందులో విశేషం ఏమీ లేదు కానీ అనన్య ఆయా ప్రాంతాల్లో పాఠాలు చెబుతూనే అక్కడ గ్రంథాలయాలు కట్టిస్తోంది. ఆడుకోవడానికి మైదానాలను సిద్ధం చేస్తోంది. ఆ పిల్లలకు ఎన్నో ఆటలు నేర్పిస్తోంది. వివిధ వర్క్‌షా్‌పలు నిర్వహిస్తోంది.
 
  •  అనన్య మొత్తంగా 600 గ్రామాల్లో వెయ్యికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 
  •  ఇప్పటికే 17 గ్రంథాలయాలు నిర్మించింది. ఈ వేసవిలో మరో రెండు నిర్మించనుంది. 
  •  లైబ్రరీ, ఇతర సామగ్రి కోసం అనన్య 10 లక్షల విరాళాలు సేకరించింది.

 ‘హలో.. నా పేరు అనన్య సాలుజా. న్యూఢిల్లీకి చెందిన అమ్మాయిని. ప్రస్తుతం పదకొండో తరగతి చదువుతున్నాను. గత రెండు సంవత్సరాల నుంచి వేసవి సెలవుల్లో వలంటీర్‌గా చేస్తున్నాను. అందులో భాగంగా లఢఖ్‌, జమ్మూ,కశ్మీర్‌ ప్రాంతాలు పర్యటించాను. అక్కడి మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో చదువుకునే ఎంతోమంది పేదవిద్యార్థులకు పాఠాలు బోధించాను. వారితో కలిసి ఆడుకున్నాను. అందరితో కలిసి స్థానిక ఆహారాన్ని తిన్నాను. అక్కడి సంప్రదాయాలను, ఆచారాలను దగ్గరగా గమనించాను. ఇదంతా ఓ మధుర జ్ఞాపకం. ఎంతో ఎంజాయ్‌ చేశాను. కష్టాలు కూడా పడ్డాను. ఈ పర్యటనల వల్ల ఎంతో నేర్చుకున్నాను. అక్కడ అంతగా సదుపాయాలు ఉండవు. అన్ని వస్తువులు దొరకవు. ఉన్నవాటితోనే సర్దుకుపోవాలి. అప్పుడు తెలిసొచ్చింది.. మన దగ్గర ఉన్న లగ్జరీ వస్తువులు మనకు సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వలేవు. అది మన భావన మాత్రమే. ఏమీ లేకపోయినా.. హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా బతుకొచ్చు. దానికి లఢఖ్‌ ప్రజలు, అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్న నేనే ఉదాహరణ’ అంటూ అనన్య తన బ్లాగులో రాసుకుంది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.