ఆఫ్ఘనిస్థాన్‌కు పాక్ అల్టిమేటం!
17-02-2017 19:44:37
ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌కు పాకిస్థాన్ అల్టిమేటం జారీ చేసింది. పాకిస్థాన్ ఆర్మీ శుక్రవారం 76 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పేర్లను ఆఫ్ఘనిస్థాన్‌ రాయబార కార్యాలయానికి అందజేసింది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దేశంలో గురువారం జరిగిన భారీ ఆత్మాహుతి దాడి నేపథ్యంలో పాకిస్థాన్ చర్యలకు ఉపక్రమించింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆఫ్గనిస్థాన్ భద్రతా సలహాదారు హనీఫ్ అత్మార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. పాకిస్థాన్‌లో జరిగిన దాడితో సంబంధం ఉన్న ఉగ్రవాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆఫ్ఘనిస్థాన్‌ రాయబార కార్యాలయానికి చెందిన ఓ అధికారిని రావల్పిండిలోని మిలటరీ హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించిన పాక్ అతడికి 76 మంది మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల పేర్లు ఉన్న జాబితాను అందించింది. జాబితాలో సూచించిన ఉగ్రవాదులపై వెంటనే చర్యలు తీసుకోవడమో, తమకు అప్పగించడమో చేయాలని కోరింది.
 
పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న ఉగ్రదాడుల్లో విలువైన ప్రాణాలు పోతున్నాయని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కారణంగా ప్రభుత్వం, ప్రజలు తీవ్ర వేదనలో ఉన్నారని తెలిపింది. పాక్‌లో జరుగుతున్న దాడుల వెనక జమాత్ ఉల్ అహ్రార్(జేయూఏ) ఉందని అజీజ్ ఉన్నారని హనీఫ్‌కు అజీజ్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌కు అందించిన జాబితాలోని ఉగ్రవాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే తమకు అప్పగించాలని ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ డిమాండ్ చేశారు.