కామశత్రువు ఉన్నాడు జాగ్రత్త!
16-02-2017 23:01:58
తెలివిలేని మిత్రుల కంటే తెలివైన శత్రువే ఎక్కువ లాభకరమైనవాడని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే తెలివైన శత్రువు మనలో ఉండే బలహీనతలను గమనించి వాటిమీద దెబ్బ తీసి విజయం సాధిస్తాడు. అతడి ఎత్తులకు చిత్తయిన తర్వాత మనం మనలోని బలహీనతలను గమనించి, వాటిని సరిదిద్దుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లి తిరిగి విజయాన్ని సాధిస్తాం. ఈ విధంగా మనలోని బలహీనతలను మనకు తెలియజేసి మనలను మెరుగుపెట్టిన బంగారంలా చేసే శత్రువు ఒకరకంగా మిత్రుడే అవుతాడు. కాని కామశత్రువు అటువంటి వాడు కానేకాడు. అందుకే శ్రీకృష్ణభగవానుడు కామశత్రువు గురించి అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. సామాన్య శత్రువుకు కామశత్రువుకు తేడా ఏమిటంటే సామాన్య శత్రువు మనకు అపజయాన్ని మాత్రమే కలుగజేస్తాడు. కాని కామశత్రువు మన చేత పాపాలు చేయించి అధోగతిపాలు చేస్తాడు. కామశత్రువు ఎత్తులకు చిత్తుకానట్టి వాడు అతి దుర్లభుడు. ఆ మహనీయుడే ఆత్మదర్శి. ఆ విషయమేమిటో కొద్దిగా తెలుసుకొందాం.
 
ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత ఈ కామశత్రువుకు చక్కగా సరిపోతుంది. కేవలం గీతాజ్ఞానం ఉన్నవ్యక్తి మాత్రమే కామశత్రువనే ఇంటిదొంగను గమనించగలుగుతాడు. సాధారణంగా ఎవరైనా స్వగృహంలో శత్రుభయం లేకుండా ఉంటారు. కాని తెలివైన శత్రువు ఈ విషయాన్ని అర్థం చేసుకుని నేరుగా ప్రత్యర్థి ఇంట్లో పాగా వేస్తాడు. సరిగ్గా కామశత్రువు కూడ ఇదే పని చేస్తున్నాడని శ్రీకృష్ణుడు తెలియజేస్తూ ‘ఇంద్రియాలు, మనసు, బుద్ధి అనేవే ఈ కామశత్రువు నివసించే స్థానాలు. అతడు ఈ ముఖ్యస్థానాల్లో ఉంటూ జీవుని నిజమైన జ్ఞానాన్ని ఆవరించి మోహింపజేస్తాడు’ (భగవద్గీత 3.40) అని గొప్ప రహస్యాన్ని తెలియజేశాడు. మనిషి అస్తిత్వంలో ఉండేవి నాలుగే నాలుగు. అవే ఇంద్రియాలు (దేహం), మనసు, బుద్ధి, ఆత్మ. ఈ నాల్గింటిలో మూడు స్థానాలను కామశత్రువు తన స్థానంగా మార్చేసుకుంటాడు. శత్రువు ఎత్తులను తెలుసుకోకపోతే అతడిపై విజయాన్ని సాధించే అవకాశం లేదు. కాబట్టి సకల మానవుల శ్రేయోభిలాషియైున గీతాచార్యుడు ఈ విషయం గురించి అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. కామశత్రువును జయించాలని కోరుకునే సాధకుడు ఈ విషయాన్ని గమనించి అతడు చొరబడటానికి అవకాశం లేనట్టి స్థానం గురించి తెలుసుకుని దానిలో స్థితుడు, సురక్షితుడు కావాలి.
 
కామశత్రువు చొరబడలేనట్టి స్థానం ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే ఆత్మయే ఆ స్థానమని చెప్పాల్సి వస్తుంది. కామశత్రువు తీవ్రంగా పనిచేసే స్థానం మనసు. అతడు మనసును ఇంద్రియ భోగాభిలాషలకు కేంద్రంగా చేసేస్తాడు. అపుడు ఇంద్రియాలు కామానికి ఆశ్రయమవుతాయి. బుద్ధిలో కూడా స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న కామశత్రువు దానిద్వారా మిథ్యాహంకారాన్ని వృద్ధి చేస్తాడు. ఈ కారణంగా మనిషి పాపాలు చేస్తూ పోతాడు. పాపాలు చేసే జీవుడు అధోగతిపాలై మానవజన్మ అవకాశాన్ని దుర్వినియోగపర్చుకుంటాడు. ‘పొగచేత అగ్ని, ధూళి చేత అద్దం, మావి చేత గర్భము కప్పబడినట్లు కామశత్రువు ద్వారా వివిధ దశలలో జీవుడు కప్పబడిపోతాడు’ (భగవద్గీత 3.38) అని గీతాచార్యుడు చెబుతున్నాడు. ఈ దశలలో పొగచేత అగ్ని కప్పబడే స్థితి మానవులకు అన్వయిస్తుంది. ధూళిచేత అద్దము కప్పబడి ఉండే స్థితి పశుపక్ష్యాదులకు అన్వయిస్తుంది. ఇక సద్భక్తుల సాంగత్యంలో ఆధ్యాత్మిక సాధన ద్వారా అగ్నిని బాగా ప్రజ్వరిల్లేటట్లు చేసి పొగను, అంటే కామశత్రువును తొలగిచుకుంటాడు. అంటే ప్రతీ వ్యక్తికి కామశత్రువుపై జయం సాధించడం సాధ్యమే. ఆ విధంగా సాధించగలిగేవాడు సమస్త పాపాల నుంచి విముక్తుడై నిత్యశాంతిని పొందుతాడు. కామశత్రువు గురించి గీతాచార్యుడు చేసిన హెచ్చరికను ప్రతి మనవుడూ సావధానంగా గమనించి పాపాలకు దూరం కావాలి, పరమానందాన్ని పొందే ప్రయత్నం చేయాలి.

(భగవద్గీత యథాతథము అధారంగా)
డాక్టర్‌ వైష్ణవాంఘ్రి సేవక దాసు
అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘము (ఇస్కాన్‌)
vaishnavanghiri@gmail.com
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.