అలౌకిక ఆనందం
16-02-2017 23:01:10
సాయి చిత్రాలు చూసినప్పుడు- ఆయన ఒక అలౌకికమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే- భగవంతుడితో మమేకమైన సందర్భాలు మనకు బాబా జీవిత చరిత్రలో ఉన్నాయి. అలాంటి అలౌకిక స్థితి వెనకున్న రహస్యమేమిటి?
మనలో చాలా మంది రోజూ దేవుడి పటం ముందు నిలబడి లేదా గుడిలో విగ్రహం ముందు నిలబడి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉంటారు. భగవంతుడిని భక్తుడిని అనుసంధానం చేసే ఒక ప్రక్రియ ప్రార్థన. ఈ ప్రార్థనతో పాటుగా పూజిస్తున్న దేవుడు లేదా గురువు పట్ల అంకితభావం చాలా ముఖ్యం. ఈ అంకితభావం బాగా పెరిగి- ప్రేమగా మారుతుంది. ఈ భావాలను శ్రీ సాయి సతచరిత్రలో నవద భక్తి (తొమ్మిది రకాల భక్తి భావాలుగా)గా పేర్కొంటారు. ఇవి శ్రవణము (వినటం), కీర్తనము (పాడటం), స్మరణము (పదేపదే తలుచుకోవటం), పాదసేవనం (పాదాలను సేవించటం), అర్చన (పూజించటం), నమస్కారము (రెండు చేతులు జోడించి నమస్కరించటం), దాస్యము (గురువుకు పూర్తి దాసోహమనటం), సఖ్యత (స్నేహము), ఆత్మనివేదన (ఆత్మను అర్పించటం). ఈ తొమ్మిదిలో అత్యంత శ్రేష్టమైనది ఆత్మనివేదనం.
 
ఈ స్థితికి చేరుకున్న తర్వాత ఈ బాహ్య ప్రపంచంతో ఉన్న భవబంధాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. తాను నమ్మిన దేవుడు లేదా గురువును చూసినప్పుడు పంచేద్రియాల నుంచి ఎనిమిది రకాల భావాలు (అష్ట భావ) వెలువడతాయి. ఈ దిశకు చేరుకున్న వారి మాటలు తడబడతాయి. శరీరంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బాహ్య ప్రపంచాన్ని మరిచి తాదాత్మ్యంతో నృత్యం చేస్తూ ఉంటారు. ఇతరుల మాటలు పట్టించుకోరు. భూమిపై పడి దొర్లుతూ ఉంటారు. తరచుగా అచేతనావస్థకు చేరుకుంటూ ఉంటారు. అయితే ఈ స్థితి అందరికి రాదు.
 
పూర్వజన్మ సుకృతం వల్ల కొందరు సద్గురువులకు మాత్రమే ఇలాంటి అలౌకిక స్థితికి చేరుకొనే అవకాశం లభిస్తుంది. ఈ స్థితికి శ్రీ చైతన్య మహాప్రభూ.. ‘రాగ-అనురాగ భక్తి’ అని, సుఫీ ఆచార్యులు ‘జలాలీ స్థితి’ అని పేరు పెట్టారు. రామకృష్ణ పరమహంస, చైతన్య మహాప్రభూ, రమణమహర్షి వంటి మహాపురుషులు ఇలాంటి స్థితిలోకి జారేవారు. సాయి కూడా చాలా సందర్భాలలో తన చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతూ ఒక విధమైన అలౌకిక స్థితికి చేరుకొనేవాడు. ఆ సమయంలో బాబా ముఖంలో ఒక రకమైన వెలుగు కనిపించేదని శ్రీ సాయి సత చరిత్ర పేర్కొంటుంది. అందువల్లే సాయి చిత్రాలను చూసినప్పుడు ఆయన ఒక అలౌకిక స్థితిలో ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది.

  • భావన
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.