99వ సమూహం!
16-02-2017 22:58:49
ఒకప్పుడు రాజపుత్ర దేశాన్ని రాజపాలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని పాలనలో దేశం సుభిక్షంగా ఉండేది. ఆయన సకల వైభోగాలు అనుభవిస్తూ ఉండేవాడు. కానీ రాజపాలుడిని ఏదో అశాంతి పీడిస్తూ ఉండేది. ఒక రోజు రాజపాలుడు తన దగ్గర పనిచేస్తున్న ఒక భటుడిని చూశాడు. ఆ భటుడు చాలా ఆనందంగా కనిపించాడు. ఏ పనినైనా చురుకుగా చేస్తున్నాడు. ముఖంలో ఏ మాత్రం చిరాకు లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. అతనిని చూసి రాజపాలుడు చాలా ఆశ్చర్యపోయాడు. తన దగ్గర సంపద, అధికారం ఉన్నా.. శాంతి లేకపోవటానికి కారణమేమిటో, ఏ మాత్రం సంపద, అధికారం లేని భటుడు ఆనందంగా ఉండటానికి కారణమేమిటో అతనికి అర్థం కాలేదు.
 
వెంటనే ఆ భటుడిని పిలిచి.. ‘‘నువ్వు ఇంత ఆనందంగా ఎందుకు ఉన్నావు?’’ అని ప్రశ్నించాడు రాజు. భటుడు ‘‘ప్రభూ.. మావి చాలా చిన్న జీవితాలు. తినటానికి తిండి.. ఉండటానికి ఇల్లు.. కట్టుకోవటానికి గుడ్డ.. ఉంటే చాలు. మీరిచ్చే జీతం నాకు, నా కుటుంబానికి సరిపోతోంది. అంతకన్నా నాకు ఏం కావాలి?’’ అని సమాధానమిచ్చాడు. రాజపాలుడికి ఆ సమాధానం నచ్చలేదు. తనకు అత్యంత సన్నిహితుడైన సలహాదారుడిని పిలిచి- ‘‘నా దగ్గర పనిచేసే భటుడు ఆనందంగా ఉన్నాడు. కానీ నేను ఎప్పుడూ అశాంతిగానే ఉంటున్నాను. దీనికి కారణమేమిటి?’’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ సలహాదారుడు- ‘‘ప్రభూ.. ఆ భటుడు ఇంకా 99 సమూహంలో చేరలేదు. అందువల్లే ఆనందంగా ఉన్నాడు..’’ అని సమాధానమిచ్చాడు.
 
‘‘ఆ సమూహం ఏమిటి? దానిలో చేరిన వారు ఆనందంగా ఎందుకు ఉండరు?’’ రాజపాలుడు ప్రశ్నించాడు. అప్పుడు ఆ సలహాదారుడు- ‘‘ప్రభూ.. ఈ సమూహం గురించి నేను చెప్పటం కన్నా మీరే తెలుసుకుంటే బావుంటుంది. ఇప్పుడో చిన్న తంత్రం పన్నుతాను.. గమనించండి..’’ అని తనకు నమ్మకమైన ఒక ఉద్యోగిని పిలిచి.. భటుడి ఇంటి దగ్గర 99 బంగారు నాణేలు ఉన్న సంచిని వదిలేసి రమ్మన్నాడు. భటుడి ఉదయం లేచిన వెంటనే గుమ్మం ముందు బంగారు నాణేలు ఉన్న సంచి కనిపించింది. అతను చాలా సంతోషించి- నాణేలు లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. 99 నాణేలు మాత్రమే సంచిలో ఉండటంతో అతను కొద్దిగా నిరాశచెందాడు. ‘‘99 నాణేలు ఇచ్చిన వారు ఇంకొక్కటి ఎందుకు ఇవ్వలేదు.. దీని వెనకున్న మతలబేమిటి?’’ అని ఆలోచించటం మొదలుపెట్టాడు.
 
అతని భార్య కూడా.. ‘‘మీకు అదృష్టం పట్టింది కాబట్టి 99 నాణేలు దొరికాయి.. వందో నాణెం దొరకకపోయినా ఫర్వాలేదు.. ముందుకన్నా కొద్దిగా ఎక్కువగా కష్టపడదాం.. అప్పుడు మనకు ఎవరో నాణెం ఇవ్వాల్సిన అవసరం లేదు..’’ అంది. దీనితో అతను ముందుకన్నా కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు. ఖాళీ సమయాల్లో కూడా ఏదో ఒక పని చేయాలనే తాపత్రయం అతనిలో పెరిగింది. దీనితో అతనిలో అశాంతి ప్రారంభమైంది. ఒక రోజు రాజపాలుడు అనుకోకుండా ఆ భటుడిని చూశాడు. ఆ భటుడిలో ముందు ఉన్న ఆనందం లేదు. ముఖంలో ఏదో అశాంతి కనిపించింది. వెంటనే అతను తన సలహాదారుడిని పిలిచి ‘‘99 నాణేలు దొరికిన తర్వాత ఆ భటుడు ఇంకా ఆనందంగా ఉంటాడనుకున్నా. కానీ నా అంచనా తప్పింది.
 
అతనిలో ఏదో తెలియని అశాంతి కనిపిస్తోంది.. కారణమేమిటో చెప్పు..’’ అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ సలహాదారుడు ‘‘ప్రభూ.. 99 నాణేలు దొరికినందుకు భటుడు ఆనందంగా ఉండాలి. కానీ అతనికి దానితో సంతృప్తి లేదు. ఇంకా ఏదో కావాలనే తపన ప్రారంభమయింది. ఆ తపనే అతనిలో ఆనందాన్ని, శాంతిని హరించేసింది. అతను కూడా నేను చెప్పిన 99వ సమూహంలో చేరిపోయాడు.. ఈ సమూహంలో చేరటానికి ఎటువంటి రుసుము ఉండదు. కానీ ఒకసారి దానిలో చేరితే జీవితాంతం అశాంతి అనే రుసుమును చెల్లిస్తూ ఉండాల్సిందే..’’ అన్నాడు. అప్పుడు రాజపాలుడికి తన అశాంతికి కారణం సంతృప్తి లేకపోవటమనే విషయం తెలిసింది!
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.