కథ మారింది 'కళ' చెదిరింది
15-02-2017 02:45:04
  • శశికళకు జైలే..
  • ‘సీఎం ఆశల’పై సుప్రీం నీళ్లు
  • అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ
  • నాలుగేళ్ల జైలు శిక్ష, పదికోట్ల జరిమానా
  • సుప్రీం కోర్టు సంచలన తీర్పు
కల చెదిరింది. ‘కళ’ తప్పింది. ఒకే ఒక్క తీర్పుతో... కథ మారింది! ముఖ్యమంత్రి పీఠంకోసం మొదలు పెట్టిన పోరులో శశికళకు ఓటమే ఎదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళకు శరాఘాతంలాంటి తీర్పు ఇచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో శశికళ పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోయారు. ఎన్నాళ్లుగానో వేచిన తీర్పు వచ్చినప్పటికీ... చాన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠ మాత్రం తొలగలేదు! తమిళనాడు సీఎం ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు! తీర్పు శశికి వ్యతిరేకమైతే మద్దతంతా తనకే అనుకున్న పన్నీర్‌ సెల్వం అంచనా ఫలించలేదు! జైలుకు వెళ్లేందుకు సిద్ధమైన శశి... తన తరఫున పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా రంగంలోకి దింపారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాతో ఆయన గవర్నర్‌ను కలిశారు! ఇక తమిళనాట ఏం జరుగనుంది? సీఎం పీఠం ఎవరికి దక్కనుంది?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): తమిళ రాజకీయాలను శాసించి, అధికార పీఠంపై నుంచి జయలలితను కదిలించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో... ‘ఎన్నాళ్లో వేచిన’ తీర్పు మంగళవారం సుప్రీంకోర్టు వెలువరించింది. జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, వీఎన్‌ సుధాకరన్‌ (శశికళ మరదలి కుమారుడు), ఇళవరసి (శశికళ అన్న భార్య)ని దోషులుగా తేల్చింది. జయ మరణించినందున తదుపరి చర్యలు నిలిపివేసినట్లు ప్రకటించింది. వీరందరినీ నిర్దోషులుగా నిర్ధారిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టేసింది. హైకోర్టు తీర్పులోని పలు అంశాలను తప్పుపట్టింది. ఈ కేసులో అంతకుముందు ప్రత్యేక న్యాయస్థానం (ట్రయల్‌ కోర్టు) ఇచ్చిన తీర్పునే సమర్థించింది.
 
జస్టిస్‌ పీసీ ఘోష్‌, జస్టిస్‌ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉదయం 10.32 గంటలకు తీర్పు వెలువరించింది. 563 పేజీల తీర్పు పూర్తిపాఠంలో కీలకమైన ఆపరేటివ్‌ భాగాన్ని జస్టిస్‌ పీసీ ఘోష్‌ చదివి వినిపించారు. ‘‘కోర్టుముందు ఉంచిన సాక్ష్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం... ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం. ట్రయల్‌ కోర్టు దోషులపై మోపిన అన్ని అభియోగాలను నిర్ధారిస్తున్నాం. దోషులంతా ట్రయల్‌ కోర్టులో లొంగిపోవాలి. నాలుగేళ్ల శిక్షలో ఇప్పటికే వీరు జైలులో గడిపిన కాలాన్ని మినహాయించి... మిగిలిన కాలం జైలులో ఉండాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్‌ అమితవ రాయ్‌ ఏడు పేజీల్లో ప్రత్యేకంగా మరో తీర్పు రాశారు. ‘‘సమాజంలో పెచ్చరిల్లుతున్న అవినీతి తీవ్రంగా కలవర పరుస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు.
 
శశి పూసిన మసి..
జయ బృందం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘కంపెనీల ముసుగు’లో అక్రమ సంపాదనను తరలించారని తెలిపింది. ‘‘జయ, ఇళవరసి ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. జయ ప్రజాసేవకురాలిగా ఉండి, ఆ సమయంలో అక్రమ ఆస్తులను కూడబెట్టిన ఆస్తులను... ఇతర కంపెనీలు, సంస్థలకు బదిలీ చేశారు. జయలలిత పాల్పడిన నేరాలకు శశికళ, ఇళవరసిలే ప్రేరణ అనే అభియోగాలు రుజువయ్యాయి. అధికారంలో ఉన్న వారు (జయలలిత) చేసిన నేరాలను ప్రేరేపించిన ప్రైవేటు వ్యక్తులను కూడా విచారించవచ్చన్న కింది కోర్టు తీర్పును సమర్థిస్తున్నాం. ఈ కేసు విషయంలో శశికళ, సుధాకరన, ఇళవరసిల ప్రేరణ, కుట్రలకు సంబంధించి కావల్సినన్ని ఆధారాలు ఉన్నాయి’’ అని తెలిపింది. అధికారంలో ఉండి అక్రమాలకు పాల్పడిన వారు చనిపోయినప్పటికీ... వారిపై అభియోగాలు మాత్రం తొలగిపోవని తెలిపింది. శశికళ బృందం శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది.
 
కుట్రల నిలయం పొయెస్‌ గార్డెన్‌
జయ నివాసం ‘పొయెస్‌ గార్డెన్‌’ వేదికగా... ఆమెకు తెలిసే నేరపూరిత కుట్రలు జరిగాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వేర్వేరు కంపెనీలు, ఖాతాల ద్వారా అక్రమార్జనను సక్రమం చేసుకున్నారని తెలిపింది. ఆయా కంపెనీలు, లావాదేవీల పూర్తి వివరాలను తీర్పులో వెల్లడించింది. అవన్నీ శశి, సుధాకరన్‌, ఇళవరసి చూసుకున్నారని... తనకేమీ తెలియదన్న జయ వాదనలు చెల్లుబాటు కావంది. వారు ముగ్గురూ జయ నివాసంలోనే ఉండేవారని గుర్తు చేసింది. ‘‘జయ పబ్లికేషన్సలోని తన నిధుల నిర్వహణపై శశికళకే జయ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివిధ సంస్థలను ఏర్పాటు చేశారు. ఒక్క రోజులోనే 10 సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇది చాలా అసాధారణం. కుట్ర జరిగిందనేందుకు ఇదే నిదర్శనం. ఈ సంస్థలన్నీ నమదు ఎంజీఆర్‌, జయ పబ్లికేషనకు అనుబంధంగా ఏర్పడినవే. అవన్నీ జయ, శశికళకు చెందినవే’’ అని గుర్తు చేసింది.
 
‘‘మిగిలిన ముగ్గురు నిందితులు ఏం చేశారో తనకు తెలియదని జయ చెప్పడం తెచ్చిపెట్టుకున్న అమాయకత్వమే! జయతో ఎలాంటి రక్తసంబంధం లేనప్పటికీ ముగ్గురికీ ఆమె తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఇది మానవతా దృక్పథంతో చేసిందేమీ కాదు. వారిది సామాజిక సహ జీవనమూ కాదు’’ అని వ్యాఖ్యానించింది. ‘‘అక్రమ పద్ధతుల ద్వారా జయలలిత పోగేసుకున్న సంపదతో... కంపెనీలు, సంస్థల పేరిట స్థలాలు కొనుగోలు చేశారు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు నిధులు ప్రవహించినట్లు దీనిద్వారా స్పష్టమవుతోంది’’ అని తెలిపింది. నార్త్‌ బీచ సబ్‌ రిజిసా్ట్రర్‌, ఉద్యానవన అధికారి ఇచ్చిన ఆధారాలు కూడా ఈ కుట్రలను నిరూపిస్తున్నాయన్నారు.
 
‘‘మిగిలిన ముగ్గురు నిందితులతో జయలలితకు ఉన్న అవినాభావ సంబంధం, ఆమె పాత్ర, ఆమెకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నప్పటికీ.. జయ చనిపోయినందున ఆమెపై ఉన్న అప్పీళ్లను తొలగిస్తున్నాం’’ అని ధర్మాసనం తెలిపింది. మిగతా ముగ్గురికి కింది కోర్టు విధించిన శిక్షలను పునరుద్ధరించింది. తక్షణం కింది కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఆరు కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కింది కోర్టు నిర్ణయాన్ని కూడా సమర్థించింది.
 
సూటిగా... సుప్రీం
  • ఈ కేసులో 1991 జూలై 1 నుంచి 1996 ఏప్రిల్‌ 30 మధ్య కాలం (చెక్‌ పీరియడ్‌) కీలకమైనది. ఈ మధ్యకాలంలో 34 కంపెనీలను ఏర్పాటు చేశారు. అందులోనూ... పది సంస్థలు ఒకేరోజు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ అప్పటికే జయ నిర్వహిస్తున్న నమదు ఎంజీఆర్‌, జయ పబ్లికేషన్స్‌కు అనుబంధమే అని నిస్సందేహంగా రుజువైంది.
  • తమ ఖాతాల్లో పడిన సొమ్ములకు ఉత్తుత్తి లెక్కలు చూపేందుకే... ఆయా కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లలో లాభాలు చూపించారు.
  • ‘చెక్‌ పీరియడ్‌’లో జయ, శశికళ పేరిట మొదట్లో 12 ఖాతాలే ఉండేవి. ఆ తర్వాత ఆ సంఖ్య 50కి పెరిగింది. నిధులను రకరకాల రూపంలో, రకరకాల మార్గాల ద్వారా మళ్లించేందుకే ఈ ఖాతాలు తెరిచారు. ఇవన్నీ ఒకే కాండానికి పుట్టిన వేర్వేరు కొమ్మలు!
  • ‘1992లో నా పుట్టిన రోజు కానుకగా 2.15 కోట్ల విలువైన బహుమతులు వచ్చాయి’ అని జయ పేర్కొన్నారు. ఈ బహుమతులను చట్టబద్ధమైన సంపాదనగా పరిగణించలేం. (బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, పట్టుచీరెలు కానుకలుగా వచ్చాయని జయ తెలిపారు.) పుట్టిన రోజున విదేశాల నుంచి ఆమె ఖాతాలో పడిన రూ.77.52 లక్షల నగదుకూ ఇదే వర్తిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అధికారంలో ఉన్న వారు ఇలాంటి కానుకలు స్వీకరించడం నిషేధం.
శభాష్‌ డి కున్హా!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి మైఖేల్‌ డి కున్హా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు ఉటంకించింది. ‘‘జయ బృందాన్ని దోషులుగా నిర్ధారిస్తూ కింది కోర్టు జరిపిన విచారణలో లోపాలేమీ లేవు. నిందితులపై అభియోగాలను విచారించే అధికారం ప్రత్యేక జడ్జికి ఉంది. ఈ కేసుకు సంబంధించిన ఆరు కంపెనీల ఆస్తులను జప్తు చేసుకోవాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పు నిర్వివాదాంశం’’ అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో... జయలలిత ఆదాయానికి మించి ఉన్న ఆస్తులు కేవలం 8.12 శాతమే అని హైకోర్టు కట్టిన లెక్కను సుప్రీం తప్పుపట్టింది. 1992లో జయకు వచ్చిన కానుకల విలువను హైకోర్టు రూ.1.5 కోట్లుగా నిర్ణయించడాన్ని కూడా సమర్థించలేదు.

సరిగ్గా 8 నిమిషాల్లో
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పది రోజులుగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న తీర్పు... కేవలం ఎనిమిది నిమిషాల్లో వెలువడింది. ఇద్దరు జడ్జిలు జస్టిస్‌ పీసీ ఘోష్‌, జస్టిస్‌ అమితవ రాయ్‌ సుప్రీంకోర్టులోని ఆరో నెంబరు హాలులోకి సరిగ్గా 10.32 గంటలకు బెంచ్‌ ఎక్కారు. కొద్దిసేపు ఇరువురూ చర్చించుకున్నారు. అప్పటికే కోర్టు హాలు కిటకిటలాడుతోంది. భారీ సైజులో ఉన్న తీర్పు కవరును సిబ్బంది తెరిచి... జడ్జిలకు అందించారు. అంతే... కోర్టు హాలులో నిశబ్దంతో కూడిన ఉత్కంఠ రాజ్యమేలింది. ‘‘తీర్పు ఎంత భారంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ భారాన్ని స్వీకరించాం’’ అని జస్టిస్‌ ఘోష్‌ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తీర్పులో కీలకమైన ఆపరేటివ్‌ పార్ట్‌ను చదవడం ప్రారంభించారు. సరిగ్గా 10.40 గంటలకు ఈ ప్రక్రియ ముగిసింది. ఆ వెంటనే కోర్టు హాలులో ఒక్కసారిగా హడావుడి, అలజడి మొదలైంది. అప్పటిదాకా ఉత్కంఠగా ఎదురు చూసిన విలేకరులు, న్యాయవాదులు ‘తీర్పును’ బయటి ప్రపంచానికి తెలిపేందుకు హుటాహుటిన పరుగులు తీశారు.
 
శశికి శిక్ష ఇది నాల్గోసారి!
అవినీతి, అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వివిధ కోర్టుల్లో శశికళకు శిక్ష పడటం ఇది నాలుగోసారి. జయలలిత జీవించి ఉండి ఉంటే... ఆమెకు ఐదోసారి శిక్షపడినట్లయ్యేది. జయ, శశికళపై మొత్తం 46 కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ జరిపేందుకు మూడు ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి. 2000 ఫిబ్రవరి 2న ప్లెజంట్‌ స్టే హోటల్‌ కేసులో జయకు మొట్టమొదటిసారి జైలు శిక్ష పడింది. ఈ కేసులో శశికళ నిందితురాలిగా లేరు. ఆ తర్వాత... అదే సంవత్సరం అక్టోబరు 9న టాన్సీ కేసులో జయ, శశికళ ఇద్దరిని కోర్టు దోషులుగా ప్రకటించింది. జైలు శిక్ష విధించింది. ఇక... 2014 సెప్టెంబరు 27న బెంగళూరు స్పెషల్‌ కోర్టు జడ్జి జాన్‌ మైఖేల్‌ డికున్హా జయ, శశితోపాటు ఇళవరసి, వీఎన్‌ సుధాకరన్‌లకు నాలుగేళ్ల జైలుశిక్ష విధించారు. తీర్పు వెలువడిన వెంటనే వీరందరినీ కోర్టు నుంచి జైలుకే తరలించారు. ఇప్పుడు... అదే కేసులో మరోసారి శశి, జయను దోషులుగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.