అపూర్వ బంధాల వారధి
04-10-2016 23:01:52
పూర్వ విద్యార్థులంతా ఒక చోట చేరి సందడి చేస్తే.. అందరూ కలిసికట్టుగా చదువుకున్న విద్యాసంస్థకు చేయూతనిస్తే.. ఎంత బావుంటుందో కదా! ఆయా విద్యాసంస్థల్లో చదువుకున్న అలాంటి విద్యార్థులందరూ కలుసుకునేందుకు ఓ ఆన్‌లైన్‌ వేదిక ఏర్పడింది. అదే వావ్‌.కామ్‌.

పూర్వ విద్యార్థులందరూ కలుసుకుని యోగక్షేమాలు కలబోసుకోవడం చూస్తూనే ఉన్నాం. అప్పట్లో తరగతిగదిలో పక్క పక్క బల్లల మీద కూర్చుని చదువుకున్న రోజులు, కలిసిమెలసి ఆటలాడుకున్న రోజులు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ అలా ఒకచోట కలుసుకోవడం అంత సులభం కాదు. అదే సోషల్‌మీడియాలాంటి నెట్‌వర్క్‌లో అయితే ఆన్‌లైన్‌లో కలుసుకోవడం తేలిక. అందుకోసం ప్రత్యేకించి పూర్వవిద్యార్థుల కోసమే పుట్టిందో కొత్త వేదిక వావ్‌.కామ్‌. ఈ సంస్థ కొంత మంది యువతీ యువకుల ఆలోచనకు ప్రతిరూపం. దీని వెనక వీరి కృషి అమోఘం.
 
అనుభవం నేర్పింది
ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల గ్రామంలో చదువుకున్నారు పరేష్‌ మసాదే. ముంబయిలోని ఎన్‌ఐటిఐఇలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ సమయంలో - తరగతి గదిలో చదువుకున్నదానికంటే అక్కడి పూర్వ విద్యార్ధుల అనుభవాలు, సలహాల ద్వారానే తను ఎక్కువగా నేర్చుకునే అవకాశం కలిగింది. పూర్వ విద్యార్థులందరు కలుసుకునే ఒక వేదిక ఉంటే బావుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. వేదిక వల్ల పూర్వవిద్యార్థుల మధ్య అనుబంధం బలోపేతం అవుతుంది. దానికితోడు ఆ విద్యాసంస్థకు ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన ఏర్పడుతుంది. అదే విషయాన్ని పరేష్‌ చెబుతూ ‘‘గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌కు వచ్చాను. ‘భూమి’ అనే స్వచ్చందసంస్థలో పనిచేస్తున్న సంజీవ్‌కు నా ఆలోచన చెప్పాను. ఆయనకు ఐడియా నచ్చింది. ఇద్దరం కలిసి అంతర్జాతీయస్థాయిలో అలుమ్ని నెట్‌వర్క్‌ ఎలా నిర్వహిస్తున్నారు, మనదేశంలో ఆ వ్యవస్థ ఎలా ఉంది? వంటి విషయాలను అధ్యయనం చేశాము. మన దగ్గర అటువంటి వేదిక కనిపించలేదు. అక్కడే మా ఆలోచనకు ఒక రూపం ఏర్పడటంతో ‘వావ్‌.కామ్‌’ పుట్టింది..’’ అన్నారు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు పరేష్‌.
 
నచ్చింది ఐడియా
ఇప్పటికే సోషల్‌మీడియా అందర్నీ ఒకటి చేస్తున్నది కానీ.. ఆయా విద్యార్థులు చదువుకున్న విద్యాసంస్థలతో ప్రత్యేక నెట్‌వర్క్‌లు అంతగా కనిపించవు. వావ్‌ ఐడియా చాలామందికి నచ్చడంతో సంస్థతో కలిశారు. అయితే ఏ సంస్థకు అయినా ప్రారంభంలో నిధుల కొరత తప్పదు. వావ్‌కు అదే పరిస్థితి ఎదురైంది. సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న సంజీవ్‌ కొసరాజు మాట్లాడుతూ ‘‘ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రారంభంలో కొంతమంది సంస్థను వదిలిపెట్టి వెళ్లిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మాలో కొందరు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ అధిగమించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది..’’ అన్నారాయన. అయితే కష్టకాలంలో సంస్థలో పనిచేసే బృందమంతా ఒక్కటిగా నిలబడ్డారు. నెట్‌వర్క్‌ బలోపేతానికి కృషిచేసి సఫలీకృతులయ్యారు. కొన్ని వందల విద్యాసంస్థలను కలిశారు. చివరికి వావ్‌ ప్రతినిధుల కష్టానికి ప్రతిఫలం లభించింది. అనుకున్న స్థాయిలో అందర్నీ ఆకర్షించింది.

ఎలా పనిచేస్తుంది?

వావ్‌ అనేది పూర్వ విద్యార్థులను వారి విద్యాసంస్థతో కలుపుతుంది. దీని ద్వారా ప్రతి విద్యాసంస్థ వారికి సంబంధించిన ప్రత్యేకమైన పూర్వవిద్యార్థుల నెట్‌వర్క్‌ను రూపొందించుకోవచ్చు. ఇందులో ఆ విద్యాసంస్థలో చదువుకున్న విద్యార్థులంతా వివరాలు నమోదు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా వావ్‌.కామ్‌లోకి వెళ్లి తమ విద్యాసంస్థ అలుమ్నిని రిజిస్టర్‌ చేసుకుంటే చాలు. దీని ద్వారా పూర్వవిద్యార్థులు అందరూ కలవాలన్నా.. వేడుకలు చేసుకోవాలన్నా చాలా సులభం. ‘‘పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించడానికి, విద్యాసంస్థ అభివృద్ధికి, చదువుకున్న రోజుల్లోని తోటి విద్యార్థులతో అనుబంధానికి ఈ నెట్‌వర్క్‌ ఎంతో దోహదపడుతుంది.’ అన్నారు వావ్‌ నిర్వాహకుల్లో ఒకరైన యశస్వి పీసపాటి.

పదిలక్షల నెట్‌వర్క్‌

ఇప్పటి వరకు వావ్‌ నెట్‌వర్క్‌లో సుమారు పది లక్షలమంది యూజర్లు రిజిస్టర్‌ అయ్యారు. ఈ ఏడాది ఈ సంఖ్య పదిరెట్లకుపైగా పెరగనుందన్నది సంస్థ ఉద్యోగుల అంచనా. అయితే దానికి తగినట్లే సవాళ్లు కూడా ఉన్నాయి. ‘‘విదేశాలతో పోలిస్తే మన దేశంలో విద్యాసంస్థలకు అలుమ్నితో సంబంధాలు కొనసాగించడం వల్ల కలిగే లాభాల గురించి అవగాహన లేదు. వాళ్ల డేటాబే్‌సను నిర్వహించుకోవడానికి ఇంకా పాతకాలపు పద్ధతులనే వాడుతున్నారు తప్ప కొత్త విధానాలను అనుసరించడం లేదు. దాంతో పూర్వ విద్యార్థులతో సంబంధాలు ఏర్పరుచుకోవడంలో మన విద్యాసంస్థలు విఫలమవుతున్నాయి..’’ అని జైపాల్‌ కడారి పేర్కొన్నారు. ఇలాంటి నెట్‌వర్క్‌ సైట్ల వల్ల పూర్వ విద్యార్థులతో ప్రస్తుత విద్యార్థులకు కెరీర్‌పరంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల విద్యాప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
 
ఇప్పటి వరకు వావ్‌ సంస్థ దాదాపు 800 వరకు విద్యాసంస్థలకు అలుమ్ని నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసింది. ఐఐటీ వారణాసి, మైసూరు యూనివర్శిటీ, ఉస్మానియా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌, ఎన్‌ఐటి నాగ్‌పూర్‌, జెఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌, అపోలో హాస్పిటల్స్‌ వంటి విద్యాసంస్థలు వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో కూడా సంస్థ సేవలు అందిస్తున్నది. కోఫీ అన్నన్‌ నెలకొల్పిన యునైటెడ్‌ నేషన్స్‌ టాస్క్‌ఫోర్స్‌కి సంబంధించిన గ్లోబల్‌ ఈ- స్కూల్స్‌ అండ్‌ కమ్యూనిటీస్‌ ఇనిషియేటివ్‌ అనే సంస్థకి ఈ మధ్యనే లీడర్‌షిప్‌ నెట్‌వర్క్‌ని ప్రారంభించింది. మీ విద్యాసంస్థను కూడా వావ్‌తో అనుసంధానం చేయాలనుకుంటే www.vaave.com ని క్లిక్‌ చేయండి.
 
- లతాకమలం 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.