ద్రావిడ భాషాకోవిదుడు
24-03-2016 01:35:37
ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణాన్ని తెలుగు వారికి పరిచయం చెయ్యడానికి ‘ద్రావిడ భాషలు’ ఉద్దిష్టమయింది. ఇందులో తెలుగు, దాని సోదర భాషల నిర్మాణాన్ని వివరించడమే కాక ఈ వర్ణనాత్మక వస్తువు ఆధారంగా మూల ద్రావిడ భాషా నిర్మాణాన్ని సాధ్యమైనంత వరకూ పునర్నిర్మించడం కూడా జరిగింది. దీనివల్ల ద్రావిడ భాషలలో ఉన్న పరస్పర సాదృశ్య భేదాలు తెలియడమే కాక, మూల ద్రావిడ భాష కాలక్రమేణ ఎటువంటి మార్పులు పొంది ఇప్పటి భాషలుగా విడిపోయిందో కూడా పఠితలకి తెలుస్తుంది. మూల ద్రావిడభాషా కాలం నుంచి ఇప్పటివరకూ తెలుగులోనూ, ఇతర ద్రావిడ భాషలలోనూ వర్ణాలూ, ప్రత్యయాలూ పొందిన పరిణామాలు ఇందులో వివరించ బడ్డాయి. ద్రావిడభాషల తులనాత్మక వ్యాకరణాన్ని తెలుగులో విపులంగా వివరించే గ్రంథం ఇంతవరకూ వెలువడలేదు. కాబట్టి తెలుగులో ఈ అంశం మీద ఇదే ప్రప్రథమ గ్రంథం అని చెప్పవచ్చు. చార్రితక వ్యాకరణం కన్న తులనాత్మక వ్యాకరణం ఒక భాష చరిత్రని వివరించడంలో శక్తిమంతమని, మొదటిది రెండో దానికి చెలికత్తె వంటిదని భాషా శాస్త్రజ్ఞుల నిర్ణయం. చార్రితకాంశాలు కూడా ఈ గ్రంథంలో వీలైనంత వరకూ ఇవ్వబడ్డాయి. తెలుగుభాషా చరిత్రని మూలద్రావిడ భాషాకాలం నుంచి తెలుగువారు తెలుసుకొనేందుకు ఈ గ్రంథం ఉపయోగిస్తుందని నమ్ముతున్నాను’ అని తమ ఉత్కృష్ట పరిశోధనా గ్రంథం ‘ద్రావిడ భాషలు’ పీఠికలో ఆచార్య పి.యస్.సుబ్రహ్మణ్యం నొక్కి వక్కాణించారు.
 
చిరస్మరణీయమైన భాషాసేవచేసిన ఆచార్య సుబ్రహ్మణ్యం ఈ నెల 17న హైదరాబాద్‌లో కీర్త్తిశేషులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో 1939జూలై 20న ఆచార్య పి.యస్‌.సుబ్రహ్మణ్యం జన్మించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో బి.ఏ. ఆనర్స్‌ (1955-60) చదివారు. 1961లో ఎం.ఏ. పూర్తి చేశారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1983లో ఎం.ఏ. సంస్కృతం డిగ్రీ సంపాదించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిష్ణాతులు. అన్నామలై విశ్వవిద్యాలయంలో 1964లో ‘డిప్లొమా ఇన్‌ లింగ్విస్టిక్స్‌’ అనే డిప్లొమా పొందారు. సుబ్రహ్మణ్యంగారు ద్రావిడ క్రియా ధాతువుల్ని తులనాత్మకంగా పరిశీలించి ‘ఏ కంపేరిటివ్‌ స్టడీ ఆఫ్‌ వర్డ్‌ ఫార్మ్స్‌ ఇన్‌ ద్రవిడియన్‌ లాంగ్వేజెస్‌’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ఆంధ్ర విశ్వకళాపరిషత్‌కి సమర్పించి 1964లో డాక్టరేట్‌ డిగ్రీ పొందారు. 1962లో అన్నామలై విశ్వవిద్యాలయంలో లింగ్విస్టిక్స్‌ శాఖలో సుబ్రహ్మణ్యం లెక్చెరర్‌గా చేరారు. 1967లో రీడర్‌గానూ, 1977లో ప్రొఫెసర్‌గానూ పదోన్నతి పొందారు. ‘ద్రావిడభాషలు’ (1977), ‘ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు’ (1984), ‘ద్రవిడియన్‌ వెర్బ్‌ మార్ఫాలజీ’ (1971), ‘ద్రవిడియన్‌ కంపేరిటివ్‌ ఫోనాలజీ’ (1983) మొదలైన గ్రంథాలను ఆయన రాశారు.
 
ద్రావిడ భాషల అధ్యయనంలో ఆరితేరిన వారు ఆచార్య సుబ్రహ్మణ్యం గారు. ఆ భాషల అధ్యయనానికి వారి ‘ద్రావిడభాషలు’ బాగా ఉపయోగపడుతుంది. ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణాన్ని తెలుగులో విశ్లేషించిన మొట్టమొదటి గ్రంథమది. చివరి గ్రంథం కూడా ఇదే. ద్రావిడభాషలపై ఇంత వివరంగా ఇలాంటి ఉత్తమ గ్రంథం తెలుగులో లేదు. ఇది పరమ ప్రామాణికగ్రంథం. అటు పరిశోధనా గ్రంథంగానూ, ఇటు పాఠ్య గ్రంథంగానూ మంచిపేరు పొందింది. అత్యాధునిక పరిశోధనల ఆధారంగా ఇందులో సకల ద్రావిడ భాషల గురించి చక్కని పరిచయం వుంది. ‘ఆధునికకాలంలో ద్రావిడభాషల వర్ణణాత్మక, తులనాత్మక పరిశోధన మీద ఆంగ్ల భాషలో గ్రంథాలు విరివిగా వచ్చాయి. ఈ గ్రంథాలలో ఉన్న అంశాలను సంగ్రహంగా తెలుగువారికి తెలుగులో వివరించడం కోసం ‘ద్రావిడ భాషలు’ రాశానని’ ఆచార్య సుబ్రహ్మణ్యం చెప్పారు.
 
ద్రావిడ భాషల అధ్యయనంలో ఎంతో కృషి చేసిన ఆచార్య సుబ్రహ్మణ్యం గారి ‘ద్రావిడ భాషలు’ వల్ల భాషాధ్యయనానికి మహోపకారం లభించింది. ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణాన్ని తెలుగులో విపులంగా వివరించిన మొదటి గ్రంథమది. ఈ గ్రంథంలో ద్రావిడ భాషల నిర్మాణం, మూల ద్రావిడ భాషా పునర్నిర్మాణం, మూల ద్రావిఢ భాష కాల్రకమంగా మార్పులు పొంది వివిధ భాషలుగా ఏర్పడిన వైనం, ద్రావిడ భాషా వర్ణాలు, ప్రత్యయాలు పొందిన పరిణామాలు ఈ గ్రంథంలో ప్రామాణికంగా వివరించబడ్డాయి. తెలుగు భాషాచరిత్రను తెలుసుకోగోరు వారికి ఈ గ్రంథం బాగా ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు.
 
సుబ్రహ్మణ్యం రాసిన మరో మంచి గ్రంథం ‘ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు’. ఈ గ్రంథం తెలుగుభాషా సాహిత్యాలు, భాషాశాస్త్రం ప్రధాన పాఠ్యాంశాలుగా విశ్వవిద్యాలయాలలో చదివే విద్యార్థులు భాషా శాస్త్రాన్ని గురించి తెలుసుకోవడానికి ఉద్దిష్టమైంది. ఇందులో మొదటి విభాగంలో భాష, వ్యాకరణాల స్వరూపం పరస్పర సంబంధం చర్చించబడ్డాయి. రెండోవిభాగంలో వర్ణణాత్మక భాషాశాస్త్ర పద్ధతులూ, మూడో విభాగంలో తులనాత్మక చరిత్రాత్మక భాషాశాస్త్ర పద్ధతులూ విపులీకరించ బడ్డాయి. భాషాశాస్త్ర సిద్ధాంతాలని గూర్చి క్షుణ్ణంగా తెలుసుకొన్నాక ఆదికాలం నుంచి వీటి పరిణామం తెలుసుకోవడం మంచిదనే ఉద్దేశంతో భాషా శాస్త్ర పరిణామ చరిత్రను నాలుగో విభాగంలో సబ్రహ్మణ్యం గారు సమీక్షించారు. తెలుగులో భాషా శాస్త్రానికి సంబంధించిన గ్రంథాల్లో ఇదే ప్రామాణికం.
 
ఆధునిక యుగంలో భాషాశాస్త్రం కొత్త మలుపు తిరుగుతోంది. కొత్తకోణాలను ఆవిష్కరిస్తున్నది. విజ్ఞానశాస్త్రం తన రెక్కలు విప్పుకొని గగనపథంలోకి ఎగబాకుతున్న నేపథ్యంలో భాషాశాస్త్రం గురించీ, దాని మౌలికస్వరూప స్వభావాల గురించి, దాని కీలకమైన సిద్ధాంతాల గురించీ తెలుసుకోవలసిన అవసరం ఏర్పడుతున్నది. సాహిత్య సిద్ధాంతాలకూ, భాషాశాస్త్ర సిద్ధాంతాలకు సమన్వయాన్ని కుదిరించవలసిన ఆవశ్యకత కూడా వున్నది. విజ్ఞాన పిపాసకులకూ ముఖ్యంగా విద్యార్థులకూ ఉపయోగపడే విధంగా ఇటీవలి ధోరణులను ఆచార్య సుబ్రహ్మణ్యం గారు తమ ‘ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు’లో సులభతరంగా విశ్లేషించారు. తులనాత్మక ద్రావిడ భాషావర్ణాలు ఆధునిక ద్రావిడభాషల్లో ఏ విధంగా పరిణామం చెందాయో ఆచార్య సుబ్రహ్మణ్యం తమ ఆంగ్ల గ్రంథాల్లో చాలా చక్కగా వివేచన చేశారు.
 ఆచార్య వెలమల సిమ్మన్న
ఆంధ్ర విశ్వవిద్యాలయం
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.