ADVT
చిన్న వ్యాపారులకు వరం ‘ముద్ర యోజన’
29-09-2015 09:25:12
కడప, మారుతీనగర్‌: చిన్న వ్యాపారస్తులకు వరం లాంటిది ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం అని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. చిన్న వ్యాపారులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు. స్థానిక హరిత హోటల్‌ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి ముద్ర రుణాల మెగా క్యాంపు కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమానికి ముందుగా మంత్రి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 32 బ్యాంకులు, 350 బ్రాంచ్‌లున్నాయన్నారు. ఇందులో ఒక్కో బ్రాంచ్‌ నుంచి 20 నుంచి 25 మంది లబ్ధిదారులకు రుణాలు అందించామన్నారు. నిరుద్యోగ యువతకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
 
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అవిశ్రాంత కృషి చేస్తున్నారన్నారు. రైతు రుణాల కోసం 23 వేల కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్‌ను 1500 రూపాయలకు పెంచి పంపిణీ చేస్తున్నదన్నారు. జాతి కోసం తపించిన దీనదయాళ్‌, మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని వారిరువురి పేరిట ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఆ మేరకు శిశు విభాగం నుంచి లబ్ధిదారులకు 50 వేల రూపాయలు, అలాగే కిశోర విభాగం నుంచి 50 వేల నుంచి 5 లక్షల రూపాయలు, తరుణ్‌ విభాగం నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల నిధులను లబ్ధిదారులకు అందించనున్నారన్నారు. కావున ఈ అవకాశాన్ని చిన్న వ్యాపారులు అందిపుచ్చుకొని ప్రగతి బాటలో నడవాలని కోరారు. కలెక్టర్‌ కె.వి.రమణ మాట్లాడుతూ ఇవాళ దేశ విదేశాలలో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయని వారిలో ఒకరు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాగా మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు పయనింపచేయాలనే ఏకైక లక్ష్యంతో విదేశాల బాట పడ్డ నవ్యాంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రప్పించేల రెక్కలు కట్టుకుని తిరుగుతున్నారన్నారు.
 
దేశ ప్రధానమంత్రి మన దేశాన్ని స్వచ్ఛమైన దేశంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో స్వచ్ఛబారత్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే అన్నారు. అలాగే పేదలకు బీమా అకౌంట్‌, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన తదితర పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు కోసం నీరు చెట్టు పెన్షన్‌ పెంపు తదితర పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు.
 
లబ్ధిదారులకు చెక్కు అందజేత
ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లబ్దిదారులకు 10 కోట్ల 81 లక్షల 85 వేల రూపాయలు గల చెక్‌ను మంత్రి కామినేని శ్రీనివాస్‌ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌-2 కృష్ణభారతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ చైర్మన్‌ సంపత్‌తో పాటుగా బీజేపీ నాయకులు సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి, మద్దిరేవుల వెంకటరమణ, విజయనరసింహులు నాగోతు రమేష్‌నాయుడు, ముద్రా బ్యాంక్‌ పథకం కన్వీనర్‌ శారదమ్మ, బీజేపీ మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ తదితరులతో పాటు పలువురు బ్యాంక్‌ అధికారులు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.