Share News

గాంధీని చంపిన గాడ్సేను పూజించే బీజేపీకి ఓటేస్తారా?

ABN , Publish Date - May 06 , 2024 | 06:07 AM

‘‘దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీని గాడ్సే చంపాడు. అలాంటి గాడ్సేను బీజేపీ నాయకులు దేవుడిలాగా చూస్తున్నారు. గాంధీని చంపిన గాడ్సేను పూజించే బీజేపీకి ఆర్యవైశ్యులు ఓటేస్తారా?’’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

గాంధీని చంపిన గాడ్సేను పూజించే బీజేపీకి ఓటేస్తారా?

వైశ్యులు, ప్రజలు ఆలోచించాలి

రాహుల్‌తోనే మహాత్ముడి ఆశయ సాధన సాధ్యం: జగ్గారెడ్డి

సిద్దిపేట టౌన్‌, మే 5: ‘‘దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీని గాడ్సే చంపాడు. అలాంటి గాడ్సేను బీజేపీ నాయకులు దేవుడిలాగా చూస్తున్నారు. గాంధీని చంపిన గాడ్సేను పూజించే బీజేపీకి ఆర్యవైశ్యులు ఓటేస్తారా?’’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరుతూ స్థానిక ముస్తాబాద్‌ చౌరస్తా నుంచి బస్టాండ్‌ మీదుగా గాంధీ చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీ, రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్‌ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు. రోడ్‌ షోలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కొందరు వైశ్యులు మద్దతు ఇస్తున్నట్లుగా తనకు తెలిసిందన్నారు. గాడ్సేకు మద్దతిస్తున్న ఆ పార్టీకి ఓట్లు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ‘రఘుపతి రాఘవ రాజారాం.. పతీత పావన సీతారాం’ అని గాంధీ నినాదమిచ్చారని, అప్పుడు బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అప్పుడు మోదీ, ఇతర నాయకులు పుట్టలేదని పేర్కొన్నారు. గాంధీజీ శ్రీరాముని గుణగణాలను ప్రజలకు వివరించారని చెప్పారు. అలాంటి గాంధీజీని అవమానించిన బీజేపీ.. రాముడి పేరుతో ఓట్లు దండుకోవడానికే ప్రజల ముందుకు వస్తోందని విమర్శించారు. గాంధీజీని చంపిన గాడ్సేకు మద్దతిస్తున్న బీజేపీ కావాలా? గాంధీజీ ఆశయాలను నేరవేర్చుతున్న కాంగ్రెస్‌ కావాలా? ఆలోచించాలని సూచించారు. గాంధీజీ భోదించిన రాముని ఆశయాలను రాహుల్‌ మాత్రమే నేరవేర్చుతారని చెప్పారు.

Updated Date - May 06 , 2024 | 06:07 AM