Share News

‘ఫైనల్‌’గా మోదీని ఓడించాలి!

ABN , Publish Date - May 06 , 2024 | 06:02 AM

ఈ లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ వర్సెస్‌ గుజరాత్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ అని, ఈ ఆటలో బీజేపీని డకౌట్‌ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మొన్న సెమీఫైనల్లో బీఆర్‌ఎ్‌సను ఓడించామని, ఈనెల 13న జరిగే

‘ఫైనల్‌’గా మోదీని ఓడించాలి!

13న పోలింగ్‌.. తెలంగాణ వర్సెస్‌ గుజరాత్‌ మ్యాచే

బీజేపీని డకౌట్‌ చేయాలి.. సెమీస్‌లో బీఆర్‌ఎస్‌ను ఓడించాం

దేవుడి పేరుతో ఓట్లు అడిగేందుకు బీజేపీ నేతలు సిగ్గుపడాలి

‘కారు’ పాడైంది జుమ్మేరాత్‌ బజార్లో అమ్మాల్సిందే: రేవంత్‌

కేటీఆర్‌.. చీర కొట్టుకొని బస్సెక్కు.. గ్యారెంటీల అమలు తెలుస్తది

మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శంషాబాద్‌,/శంషాబాద్‌ రూరల్‌/షాద్‌నగర్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ఈ లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ వర్సెస్‌ గుజరాత్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ అని, ఈ ఆటలో బీజేపీని డకౌట్‌ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మొన్న సెమీఫైనల్లో బీఆర్‌ఎ్‌సను ఓడించామని, ఈనెల 13న జరిగే ఫైనల్లో మోదీని ఓడించాలని అన్నారు. ఆదివారం నిర్మల్‌, ఆలంపూర్‌లో రాహుల్‌ గాంధీ పాల్గొన్న జనజాతర సభల్లో.. రంగారెడ్డి జిల్లా తుక్కగూడ, శంషాబాద్‌లో రోడ్‌షోల్లో, కార్నర్‌మీటింగ్‌ల్లో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఐటీఐఆర్‌, మూసీ ప్రక్షాళన, బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇస్తామని పేర్కొన్నారని.. మోదీ ప్రభుత్వం వచ్చాక రైల్వే కర్మాగారాన్ని లాతూర్‌కు తరలించి, మిగతా హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఫలితంగా తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ గాడిదగుడ్డు తప్ప ఇచ్చిందేమీ లేదని పేర్కొన్నారు. దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లను అడుక్కుంటోందని.. ఇందుకు ఆ పార్టీ సిగ్గుపడాలన్నారు. రాముడిని, కృష్ణుడిని అందరం పూజించుకుంటామని.. మోదీ మాత్రం రాముడిని తామే సృష్టించినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పంచిన అక్షింతలు అక్కడివి కావని.. రాష్ట్రంలోనే రేషన్‌ బియ్యానికి పసుపు పూసి జనానికి ఇచ్చారని విమర్శించారు. ‘కారు’ రిపేర్‌కొస్తే గ్యారేజీకి వెళ్లిందని, మళ్లీ వస్తుందని కేసీఆర్‌, కేటీఆర్‌ చెబుతున్నారని.. అయితే ఆ ‘కారు’ పాడై పనికిరాకుండా పోయింద ని.. జుమ్మేరాత్‌ బజార్‌లో తెగనమ్మాల్సిందేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గత ఐదు నెలల పానలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని అంటున్న కేటీఆర్‌, తన అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు చక్కగా చీరకట్టుకొని ఆర్టీసీ బస్సెక్కాలని సూచించారు.


‘‘అయ్యా నీకు సినీ పరిశ్రమల వాళ్లు బాగా తెలుసు కదా.. నువ్వు చీరకట్టుకొని ఆడపిల్లగా మంచిగా తయారై ఆర్టీసీ బస్సెక్కు. నిన్ను టికెట్‌ కోసం పైసలడిగితే అడిగితే ఆరు గ్యారెంటీలు అమలుకానట్టే. అడకపోతే మేం ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్లే’’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హామీ ఇచ్చినట్లుగా ఆరు గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలుచేస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాను తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈనెల 9లోగా రైతుభరోసాని పూర్తిస్థాయిలో అమలుచేస్తామని పునరుద్ఘాటించారు. హరీశ్‌రావు రూ. 2 లక్ష ల రుణమాఫీ చేయలేదంటున్నారని, పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని, రాజీనామాకు హరీశ్‌ సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లపాటు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసి.. దళితులు, గిరిజనులను బానిసలుగా మార్చి.. కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తుందని హెచ్చరించారు. అప్పట్లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ సముద్రం పక్కన సూరత్‌లో సంసారం పెట్టి మన రాజుల మఽధ్య చిచ్చుపెట్టి దేశాన్నే అక్రమించుకొని, వందల ఏళ్లు దేశాన్ని పాలించిందని.. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత అదే సూరత్‌ నుంచి వచ్చిన మోదీ, అమిత్‌ షా పార్టీల మధ్య చిచ్చుపెట్టి ఏళ్లకు ఏళ్లు ఏలాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాగా రాహుల్‌ గాంధీ ఆఽధ్వర్యంలో నిర్మల్‌, ఆలంపూర్‌లో జరిగిన జనజాతర సభలకు మండుటెండలో కూడా జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సభలు సక్సెస్‌ కావడంతో కాంగ్రెస్‌ నేతల్లో నూతనోత్సాహం నెలకొంది.

Updated Date - May 06 , 2024 | 06:05 AM