Share News

వామ్మో.. 47 దాటేసింది!

ABN , Publish Date - May 06 , 2024 | 05:56 AM

నిప్పులు కక్కుతున్న సూరీడు.. మరో రికార్డును దాటేశాడు..! వారం రోజుల పాటు 46 డిగ్రీలకు పైనే నిలిచిన భానుడు.. తాజాగా 47 డిగ్రీలు కూడా దాటేశాడు.. రోళ్లు పగిలే రోహిణి కార్తెకు ముందే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1

వామ్మో.. 47 దాటేసింది!

జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీలు

ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత

సాయంత్రానికి పలు జిల్లాల్లో వానలు

వడదెబ్బకు ఐదుగురు.. పిడుగులు పడి నలుగురి మృత్యువాత

మరో మూడు రోజులు రాష్ట్రంలో ఎండలే

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): నిప్పులు కక్కుతున్న సూరీడు.. మరో రికార్డును దాటేశాడు..! వారం రోజుల పాటు 46 డిగ్రీలకు పైనే నిలిచిన భానుడు.. తాజాగా 47 డిగ్రీలు కూడా దాటేశాడు.. రోళ్లు పగిలే రోహిణి కార్తెకు ముందే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం.. జగిత్యాల జిల్లా గోధూరులో 46.8, కరీంనగర్‌ జిల్లా అల్లీపూర్‌లో 46.7, నిర్మల్‌ జిల్లా బుట్టాపూర్‌లో 46.5, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌, జన్నారంలో 46.3, నిజామాబాద్‌, మంచిర్యాల జిల్లా వెల్గనూరులో 46.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అయితే సాయంత్రానికి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు అక్కడక్కడ వర్షం కురవడంతో జనం ఊరట చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో గంట పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.


వడదెబ్బకు ఐదుగురు.. పిడుగులకు నలుగురి బలి

రాష్ట్రంలో వడదెబ్బతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పిడుగులు పడి నలుగురు మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం చిన్న కోమటిపల్లిలో మూడెడ్ల రాజయ్య (50), మహబూబాబాద్‌ జిల్లా గార్లలో జమాలపూరి నాగేందర్‌ (70), భద్రాచలం పట్టణంలో చింతకాయల సంజయ్‌ (14), నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌లో కాళ్ల లక్ష్మి (75), జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని మరో వ్యక్తి ఎండలకు అస్వస్థత చెంది మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కావటి పద్మమ్మ గొర్రెలు మేపేందుకు వెళ్లి పిడుగు పాటుకు మరణించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు మండ లం కోటమర్తిలో పశువుల కొట్టంపై పిడుగు పడగా.. కొట్టంలోని రైతు చిప్పలపల్లి బాలమల్లు (65)తో పాటు ఓ పాడి గేదె మృతి చెందింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరులో దాసరి అజయ్‌ (23)తో పాటు రెండు పాడి పశువు లు పిడుగు పాటుకు మరణించాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో కల్లంలో మిర్చి తడవకుండా పరదాలు కప్పేందుకు వెళ్లిన రైతు బుల్లయ్య (45) సమీపంలో పిడుగు పడగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మూడ్రోజులు ఎండలే..’

వచ్చే మూడ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని తెలిపింది.

Updated Date - May 06 , 2024 | 05:56 AM