Share News

జడేజా ఆల్‌రౌండ్‌ షో

ABN , Publish Date - May 06 , 2024 | 05:29 AM

స్వస్థలంలో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓడిన కసిమీదున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు..ఈసారి రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43, 3/20) షోతో అదే కింగ్స్‌ను మట్టికరిపించింది....

జడేజా ఆల్‌రౌండ్‌ షో

పంజాబ్‌పై చెన్నై విజయం

ధర్మశాల: స్వస్థలంలో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓడిన కసిమీదున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు..ఈసారి రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43, 3/20) షోతో అదే కింగ్స్‌ను మట్టికరిపించింది. చేసింది స్వల్ప స్కోరే అయినా జడేజాతోపాటు పేసర్లు కీలక సమయాల్లో రాణించడంతో ప్రత్యర్థిని 28 పరుగులతో చిత్తు చేసింది. తద్వారా చెన్నై మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట చెన్నై 20 ఓవర్లలో 167/9 స్కోరు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (32), మిచెల్‌ (30) తమవంతు పాత్ర పోషించారు. రాహుల్‌ చాహర్‌, హర్షల్‌ పటేల్‌ చెరో 3, అర్ష్‌దీప్‌ సింగ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 139/9 స్కోరుకే పరిమితమైంది. ప్రభ్‌సిమ్రన్‌ (30), శశాంక్‌ సింగ్‌ (27) పర్లేదనిపించారు. సిమర్‌జీత్‌, తుషార్‌ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తీశారు. జడేజా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో చెన్నై మూడో స్థానానికి దూసుకొచ్చింది. కాగా, బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించే హైబ్రిడ్‌ పిచ్‌పై ఈ మ్యాచ్‌ను నిర్వహించడం విశేషం.


వికెట్లు టపా..టపా: భారీ ఛేదన కాదు..పైగా గత మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్‌ బ్యాటర్లు ఆడిన తీరు చూస్తే మళ్లీ కింగ్స్‌ సునాయాసంగా నెగ్గగలదని భావించారు. కానీ కీలక తరుణంలో చెన్నై బౌలర్లు ప్రత్యర్థికి చెక్‌ పెట్టారు. తన తొలి ఓవర్లోనే బెయిర్‌ స్టో (7), రొసో (0)లను తుషార్‌ బౌల్డ్‌ చేసి పంజాబ్‌ను దెబ్బ కొట్టాడు. ప్రభ్‌సిమ్రన్‌, శశాంక్‌ భారీషాట్లతో అలరిస్తూ మూడో వికెట్‌కు 53 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. వీరు క్రీజులో ఉన్నంతసేపూ మ్యాచ్‌ పంజాబ్‌పైనే మొగ్గింది. అయితే 8వ ఓవర్లో శశాంక్‌ను శాంట్నర్‌, 9వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ను జడేజా, 10వ ఓవర్లో జితేశ్‌ (0)ను సిమర్‌జీత్‌ పెవిలియన్‌ చేర్చడంతో పంజాబ్‌ ఓటమి దాదాపు ఖాయమైంది. కర్రాన్‌ (7), అశుతోష్‌ (3) విఫలమయ్యారు. హర్‌ప్రీత్‌ (17 నాటౌట్‌), రాహుల్‌ చాహర్‌ (16), రబాడ (11 నాటౌట్‌) మెరుపులు పంజాబ్‌ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి.

ఆ నలుగురి చలవతో..: జడేజా, రుతురాజ్‌, మిచెల్‌.. ఆఖర్లో శార్దూల్‌ (17) ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెన్నై సవాలు విసిరే స్కోరు చేసింది. రహానె (9) త్వరగా అవుటైనా.. రుతురాజ్‌ దంచడంతో పవర్‌ ప్లేను 60/1తో చెన్నై ముగించింది. కానీ 8వ ఓవర్లో స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ రుతురాజ్‌ను, దూబే (0)ని పెవిలియన్‌ చేర్చి చెన్నైకి డబుల్‌ షాకిచ్చాడు. తొమ్మిదో ఓవర్లో మిచెల్‌ను ఎల్బీ చేసిన హర్షల్‌ పంజాబ్‌కు మరో కీలక బ్రేక్‌ ఇచ్చాడు. అయితే జడేజా, మొయిన్‌ అలీ (17), శాంట్నర్‌ (11), శార్దూల్‌ రాణించడంతో చెన్నై స్కోరు 150 దాటింది.


స్కోరుబోర్డు

చెన్నై: రహానె (సి) రబాడ (బి) అర్ష్‌దీప్‌ 9, రుతురాజ్‌ (సి) జితేష్‌ (బి) చాహర్‌ 32, మిచెల్‌ (ఎల్బీ) హర్షల్‌ 30, దూబే (సి) జితేష్‌ (బి) చాహర్‌ 0, మొయిన్‌ (సి) బెయిర్‌ స్టో (బి) కర్రాన్‌ 17, జడేజా (సి) కర్రాన్‌ (బి) అర్ష్‌దీప్‌ 43, శాంట్నర్‌ (సి) కర్రాన్‌ (బి) చాహర్‌ 11, శార్దూల్‌ (బి) హర్షల్‌ 17, ధోనీ (బి) హర్షల్‌ 0, తుషార్‌ (నాటౌట్‌) 0, గ్లీసన్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 167/9: వికెట్లపతనం: 1-12, 2-69, 3-69, 4-75, 5-101, 6-122, 7-150, 8-150, 9-164; బౌలింగ్‌: రబాడ 3-0-24-0, అర్ష్‌దీప్‌ 4-0-42-2, కర్రాన్‌ 4-0-34-1, హర్‌ప్రీత్‌ 1-0-19-0, రాహుల్‌ చాహర్‌ 4-0-23-3, హర్షల్‌ 4-0-24-3.

పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) సబ్‌ సమీర్‌ (బి) జడేజా 30, బెయిర్‌ స్టో (బి) తుషార్‌ 7, రొసో (బి) తుషార్‌ 0, శశాంక్‌ (సి) సిమర్‌జీత్‌ (బి) శాంట్నర్‌ 27, కర్రాన్‌ (సి) శాంట్నర్‌ (బి) జడేజా 7, జితేశ్‌ (సి) ధోనీ (బి) సిమర్‌జీత్‌ 0, అశుతోష్‌ (సి) సిమర్‌జీత్‌ (బి) జడేజా 3, హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 17, హర్షల్‌ (సి) సబ్‌ సమీర్‌ (బి) సిమర్‌జీత్‌ 12, రాహుల్‌ చాహర్‌ (బి) శార్దూల్‌ 16, రబాడ (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 139/9; వికెట్లపతనం: 1-9, 2-9, 3-62, 4-68, 5-69, 6-77, 7-78, 8-90, 9-117; బౌలింగ్‌: శాంట్నర్‌ 3-0-10-1, తుషార్‌ 4-0-35-2, గ్లీసన్‌ 4-0-41-0, జడేజా 4-0-20-3, సిమర్‌జీత్‌ 3-0-16-2, శార్దూల్‌ 2-0-12-1.

Updated Date - May 06 , 2024 | 05:29 AM