Share News

అమరావతిని బతికించుకుందాం

ABN , Publish Date - May 06 , 2024 | 05:47 AM

రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ఎంత ముఖ్యమో తెలియదు గానీ అమరావతి రైతులకు మాత్రం కీలకంగా మారాయి. వారు ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు

అమరావతిని   బతికించుకుందాం

5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక

  • రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న వైసీపీ

  • రాజధానిపై కల్లబొల్లి మాటలతో నమ్మించిన జగన్‌

  • అధకారంలోకి వచ్చాక 3 ముక్కలాటతో ద్రోహం

  • అప్పుల్లో మునిగాం... ఈసారి అభివృద్ధికి ఓటేద్దాం

  • మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి

  • 300మంది రాజధాని మహిళా రైతుల ప్రచారం

  • 15 రోజుల్లో... పది నియోజకవర్గాల్లో పర్యటనలు

  • కూటమి అభ్యర్థులను గెలిపించాలని వినతులు

మంగళగిరి, మే 5: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ఎంత ముఖ్యమో తెలియదు గానీ అమరావతి రైతులకు మాత్రం కీలకంగా మారాయి. వారు ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు.

అందుకే రాజధానిని బతికించుకోవడమే లక్ష్యంగా ప్రచారం బాటపట్టారు. రాజకీయ పార్టీల గెలుపోటములు తమకు ముఖ్యం కాదని, రాజధాని అమరావతి గెలవాలన్నదే తమ ఉద్దేశమని చెబుతున్నారు. రాజధాని రైతు కుటుంబాలకు చెందిన మహిళలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అమరావతిని గెలిపించి, తమను బతికించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

మహిళా రైతులు పెద్దసంఖ్యలో వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, ప్రచారం చేస్తున్నారు. ఠారెత్తిస్తున్న ఎండలకు అభ్యర్థులు సైతం భయపడిపోయి ఉదయం, సాయంత్రం మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.

కానీ వీరు మాత్రం మండుటెండను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గాల్లో తిరుగుతూ తమకు న్యాయం చేయండని ప్రజలను బతిమాలుకుంటున్నారు.

అమరావతి రైతులు గత 15 రోజులుగా తాడికొండ, మంగళగిరి, వేమూరు, పత్తిపాడు, గన్నవరం, గుడివాడ, అద్దంకి, ఉండి, భీమవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు. మొత్తం 300 మంది రైతులు రెండు బృందాలుగా విడిపోయి రెండేసి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

ఈ బృందాల్లో అత్యధిక శాతం మంది మహిళా రైతులే ఉండటం విశేషం. ఈ ప్రచార పర్యటనలు ఇంకా కొనసాగుతున్నాయి. రైతు బృందాలు తమ ప్రచారంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పక్షాలు రాజధాని అమరావతికి సానుకూలంగానే ఉండటంతో పాటు రైతుల ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి.

వైసీపీ మాత్రమే వ్యతిరేకంగా పావులు కదుపుతూ రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఐదేళ్లూ అమరావతి పనులు సాగి ఉంటే...

రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే రాష్ట్ర రాజధానిగా అమరావతి నిలదొక్కుకుంటుందని, రాజధాని లేని రాష్ట్రమన్న అపఖ్యాతి నుంచి ఏపీ బయటపడుతుందని అమరావతి రైతులు ఓటర్లకు వివరిస్తున్నారు. ఐదేళ్లపాటు రాజధాని అమరావతి పనులు కొనసాగి ఉంటే రాష్ట్రం అప్పులబారిన పడేది కాదని పేర్కొంటున్నారు.

అమరావతి కేవలం తమ భవిష్యత్తు ఒక్కటే కాదని.. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకని వివరిస్తున్నారు. అమరావతిని ధ్వంసం చేయాలని సీఎం జగన్‌ ఎన్ని కుయుక్తులు పన్నినా... అసత్య ప్రచారాలు చేసినా, తమను ఎంతగానో అవమానించి, అవహేళనలకు గురిచేసినా వెనకడుగు వేయకుండా ఆశయ సాధన కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నామని చెబుతున్నారు.

అమరావతి రూ.2లక్షల కోట్ల సంపదని అర్థం చేసుకోవడంలో జగన్‌ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని నిర్మాణం కోసం తమ భూములు వదులుకుని త్యాగాలకు సిద్ధపడ్డామని వారు ప్రజలకు వివరిస్తున్నారు. తాము ఇచ్చిన భూముల్లో తమకు కేవలం 25శాతం మాత్రమే రిటర్నబుల్‌ ప్లాట్ల రూపంలో ఇచ్చి మిగతా 75 శాతం భూములను రాజధాని కోసం వినియోగిస్తామని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ముందస్తుగా చెప్పినప్పటికీ సంతోషంగా అంగీకరించామని, తమ బిడ్డలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవారి పిల్లలు సైతం పొరుగు రాష్ట్రాలకు వలసలు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు లభిస్తుందని ఆనందించామని పేర్కొంటున్నారు.

కానీ రాజధాని ఇక్కడే ఉంటుందని జగన్‌ కల్లబొల్లి మాటలతో తమను నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మూడు రాజధానుల పేరిట ద్రోహం చేశారని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. జగన్‌ నిర్వాకంతో తమ త్యాగం వృధాగా మారి, భూములన్నీ నిష్ప్రయోజనమయ్యాయని వాపోతున్నారు. రాష్ట్రాన్ని, రాజధానిని అభివృద్ధి చేసేవారికే ఓటేయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెడితే కానీ రాష్ట్రం అభివృద్ధి చెందదని వారు ప్రజలకు వివరించి చెబుతున్నారు.


  • 2,400 మందిపై 3,600 కేసులు పెట్టారు

రాజధాని అమరావతి ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి భయభ్రాంతులను చేసేందుకు పదేపదే ప్రయత్నించింది. మొత్తం 2,400 మందిపై ఇప్పటివరకు సుమారు 3,600 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మా ఉద్యమం ఆరంభమై ఇప్పటికి 1,600 రోజులు అవుతోంది. 2019లో రాష్ట్రంలో ప్రభుత్వం మారేంతవరకు రాజధాని గ్రామాల్లో ఎక్కడా అమల్లో లేని 30 పోలీసు యాక్ట్‌ జగన్‌ సీఎం కాగానే అమల్లోకి వచ్చింది.

- కొమ్మినేని వరలక్ష్మి,

అమరావతి ఉద్యమ మహిళా రైతు

రైతుల ఉసురు పోసుకోవద్దు

రాజధాని రైతుల ఉసుసు పోసుకోకుండా ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని పాలకులకు విన్నవించుకుంటూ వచ్చాం. ఒప్పందం ప్రకారం రాజధానిని ఇక్కడే కొనసాగించాలని కోరడమే తప్పన్నట్టుగా ప్రభుత్వం మాపై దమనకాండ సాగించింది. పోలీసులతో కవాతు చేయిస్తూ రాజధాని గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇది మాకు మాత్రమే కాదు.. మొత్తంగా రాష్ట్రానికే అతిపెద్ద అన్యాయమని ప్రజలకు వివరించి, న్యాయాన్ని అర్థించడానికి ప్రచారంలోకి దిగాం.

- గుమ్మా రమాదేవి, మహిళా రైతు

Updated Date - May 06 , 2024 | 05:48 AM