Share News

అయ్యో.. మొక్కజొన్న

ABN , Publish Date - May 19 , 2024 | 12:51 AM

నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు వల్లూరుపాలెం, రొయ్యూరు, తోట్లవల్లూరు గ్రామాల్లో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదే అదునుగా ప్రైవేట్‌ వ్యాపారులు ధరను భారీగా తగ్గించేయడంతో రైతులు కష్టాల్లో కూరుకుపోయారు.

అయ్యో.. మొక్కజొన్న

అకాల వర్షాలకు తడిసిన పంట

క్వింటాకు రూ.300 తగ్గించిన వ్యాపారులు

కష్టాల్లో కూరుకుపోయిన రైతన్న

తోట్లవల్లూరు, మే 18 : నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు వల్లూరుపాలెం, రొయ్యూరు, తోట్లవల్లూరు గ్రామాల్లో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదే అదునుగా ప్రైవేట్‌ వ్యాపారులు ధరను భారీగా తగ్గించేయడంతో రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. క్వింటా మొక్కజొన్న రూ.2,100 నుంచి రూ.2,200కు కొంటున్న వ్యాపారులు వర్షాన్ని కారణంగా చూపి ధరను తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం కుండపోత వాన కురవటంతో ఆరబెట్టిన మొక్కజొన్న పంట మళ్లీ తడిసిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎకరంలో పంటను ఆరబెట్టి, పైన కప్పేందుకు పరదాలకు రోజుకు రూ.300 అద్దె ఖర్చవుతుందని, కూలీలకు రూ.1,500 ఖర్చవుతుందని, ఈ నేపథ్యంలో ధరలో కోత పెట్టడం తీవ్ర నష్టాలను కలిగి స్తుందని రొయ్యూరు రైతు వెంకటేశ్వరరావు తెలిపారు. 3,230 ఎకరాల్లోని మొక్కజొన్న సాగును ఈ-క్రాప్‌ చేసిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవటం వల్ల నష్టం కలుగుతోందని రైతు బి.కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా తమ వద్దకు రాలేదన్నారు.

తడిపేసిన వాన

మచిలీపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి) : వాతావరణ మార్పులతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 22 వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, శనివారం మోపిదేవిలో అత్యధికంగా 19.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పెదపారుపూడిలో 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 5.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇక అవనిగడ్డలో 13.4, మొవ్వలో 8.6, చల్లపల్లిలో 8.4, కంకిపాడు, కృత్తివెన్ను, పెనమలూరులో 8.2, నాగాయలంకలో 8.0, ఘంటసాలలో 7.8, పెడనలో 6.8, బంటుమిల్లిలో 6.2, మచిలీపట్నంలో 6.2, కోడూరులో 5.2, గూడూరులో 3.6, ఉయ్యూరులో 2.8, బాపులపాడులో 2.4, గన్నవరంలో 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - May 19 , 2024 | 12:51 AM