Share News

ఆక్రమణలపై ఎన్నికల బహిష్కరణాస్త్రం

ABN , Publish Date - May 06 , 2024 | 05:13 AM

కర్నూలు నగరంలోని నాలుగో తరగతి ఉద్యోగులు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. తమ సొసైటీ స్థలాల ఆక్రమణ, మంచినీటి సమస్యల కారణంగా వారీ నిర్ణయం తీసుకున్నారు.

ఆక్రమణలపై ఎన్నికల  బహిష్కరణాస్త్రం

కర్నూలులోని నాలుగో తరగతి ఉద్యోగుల ఉద్యమం

కర్నూలు నగరంలోని నాలుగో తరగతి ఉద్యోగులు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. తమ సొసైటీ స్థలాల ఆక్రమణ, మంచినీటి సమస్యల కారణంగా వారీ నిర్ణయం తీసుకున్నారు. ‘ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’ అంటూ ఆదివారం కాలనీ ప్రధాన ద్వారం వద్ద ఫెక్సీని ఏర్పాటు చేశారు.

‘కబ్జాకు గురైన 7.5 ఎకరాల మూడు పార్కు స్థలాల్లో ఆక్రమణలు తొలగించి పార్కులను ఏర్పాటు చేయలేని నాయకులు మాకు అవసరం లేదు. పది వేలకుపైగా జనాభా ఉన్న మా కాలనీలో ఒక్క ఓవర్‌ హెడ్‌ ట్యాంకు కూడా ఏర్పాటు చేయలేని నాయకులు అవసరం లేదు’ అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

సమస్య ఏమిటంటే.. కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలోని నాలుగో తరగతి ఉద్యోగులు ‘ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయీస్‌ కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ’గా ఏర్పడి 1989లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 82 ఎకరాలు కొనుగోలు చేశారు. దానిలో 7.50 ఎకరాలను సామాజిక అవసరాల కోసం వదిలారు.

ప్రస్తుతం ఆ కాలనీలో 13 వేల జనాభా, 6,500 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సామాజిక అవసరాల కోసం వదిలిపెట్టిన స్థలంలో వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఓ మంత్రి తన బంధువులకు ఇళ్లు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.

దాన్ని అవకాశంగా చేసుకుని మరికొందరు కూడా ఆ స్థలాలను ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాలనీలోని పార్కు స్థలంపై అధికార పార్టీ నేతల కన్నుపడింది.

ఓ వైసీపీ నాయకుడు పార్కు స్థలాన్ని ఆక్రమించుకుని గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాడు. అందులో రోడ్లు కూడా వేయించాడు. ప్రస్తుతం ఆ కాలనీలో సెంటు భూమి రూ.15-20 లక్షలకుపైగా ఉంది. అంటే కబ్జాకు గురైన పార్కు స్థలం విలువ రూ.125 కోట్లకు పైగా ఉంటుంది.

కాలనీలో ఆక్రమణలు తొలగించి పార్కు స్థలాలను రక్షించాలని నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ హౌస్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి షేక్‌ ఇదాయతుల్లా, కోశాధికారి రమణ తదితరులు కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. పార్కు రక్షణకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొంటామని కాలనీ వాసులు తెగేసి చెబుతున్నారు.

- కర్నూలు, ఆంధ్రజ్యోతి

Updated Date - May 06 , 2024 | 05:13 AM